
ఏపీ రెసిడెన్షియల్ ప్రవేశ ఫలితాలు విడుదల
ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ వివిధ తరగతుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షల ఫలితాలను మంగళవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు.
సాక్షి, హైదరాబాద్: ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ వివిధ తరగతుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షల ఫలితాలను మంగళవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. సొసైటీ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 50 రెసిడెన్షియల్ స్కూళ్లలో 3,904 సీట్లకుగాను 23,609 మంది ఐదో తరగతిలో ప్రవేశానికి పరీక్షలు రాశారు. వీరిలో 90.54 శాతం ఉత్తీర్ణులయ్యారు. పది జూనియర్ కాలేజీల్లో 1,425 సీట్లుండగా 56,083 మంది పరీక్ష రాశారు. వీరిలో 83.62 శాతం ఉత్తీర్ణత సాధించారు. డిగ్రీ కాలేజీల్లో 432 సీట్లుండగా 5,792 మంది పరీక్ష రాయగా 82.33 శాతం ఉత్తీర్ణులయ్యారు.
ఏపీ ఆర్‌జేసీ సెట్‌లో టాపర్లు వీరే
ఏపీ ఆర్‌జేసీ సెట్‌లో 150 మార్కులకుగాను ఎంపీసీ విభాగంలో మహ్మద్ ఖమర్ ఝా (పశ్చిమగోదావరి) ఎస్.వెంకటసాయి గోకుల్ (నెల్లూరు), జె.విజయపాల్ (ప.గో.) 146 మార్కులు చొప్పున సాధించి మొదటి మూడు ర్యాంకులు పొందారన్నారు. బైపీసీలో బి.దుర్గాభవాని (ప.గో.) 145, కె.జాహ్నవి (శ్రీకాకుళం) 143, జి.హేమంత్‌కుమార్ (అనంతపురం) 141 మార్కులతో మొదటి మూడు ర్యాంకులు సాధించారు. ఎంఈసీలో డీఏవీ పద్మరాజు (గుంటూరు) 138, ఎం.సంపత్‌కుమార్ (ప.గో.) 137, వి.దిలీప్ వర్మ (ప.గో.) 136 మార్కులతో మొదటి మూడు ర్యాంకులు సాధించినట్లు మంత్రి వివరించారు. ఏపీ ఆర్‌జేసీ సెట్‌లో ఆర్ట్స్, కామర్స్, ఫిజికల్ సైన్స్, లైఫ్‌సెన్సైస్ కోర్సుల్లో అత్యధిక మార్కులు సాధించిన వారి పేర్లను మంత్రి ప్రకటించారు.