విద్యుత్ బకాయిలు చెల్లించాలి : ఏపీ
విద్యుత్ బకాయిలు చెల్లించాలి : ఏపీ
Published Tue, Oct 25 2016 10:22 PM | Last Updated on Wed, Sep 5 2018 4:17 PM
హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థలు బకాయిలు తక్షణమే చెల్లించాలని ఏపీ ట్రాన్స్ కో అధికారులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆ రాష్ట్రానికి తాము ఇక విద్యుత్ సరఫరా చేయడం సాధ్యంకాదని తేల్చి చెప్పారు. దక్షిణ ప్రాంత విద్యుత్ కమిటీ (ఎస్‌ఆర్‌పీసీ) సమావేశం హైదరాబాద్‌లో మంగళవారం జరిగింది. కమిటీ సభ్యుడు భట్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి ఏపీ జెన్‌కో ఎండీ విజయానంద్, ట్రాన్స్‌కో జెఎండీ దినేష్ పరుచూరి, జెన్‌కో ఫైనాన్స్ డైరెక్టర్ ఆదినారాయణతోపాటు రెండు రాష్ట్రాల విద్యుత్ అధికారులు హాజరయ్యారు.
ఏపీ అధికారులు మాట్లాడుతూ...'విభజన చట్టం ప్రకారం ఏపీ నుంచి తెలంగాణకు 450 మెగావాట్ల విద్యుత్ అదనంగా ఇస్తున్నాం. రాష్ట్ర విభజన నాటినుంచి ఈ బకాయిలు వడ్డీతో సహా రూ.4282 కోట్లు పేరుకుపోయాయి. వీటి గురించి ఎన్నిసార్లు లేఖలు రాసినా తెలంగాణ నుంచి స్పందన రాలేదు. మరోవైపు ఏపీ థర్మల్ ప్లాంట్లకు సింగరేణి బొగ్గును సరఫరా చేస్తోంది. ఆ సంస్థకు ఏపీ విద్యుత్ సంస్థలు రూ. 1500 కోట్ల మేర బకాయి పడ్డాయి. ఈ బకాయిలు తక్షణమే చెల్లించాలని తెలంగాణ విద్యుత్ సంస్థలని' డిమాండ్ చేశారు. దీనిపై ఈ నెల 31లోగా వివరణ ఇవ్వాలని ఎస్‌ఆర్‌పీసీ తెలంగాణా విద్యుత్ సంస్థలను ఆదేశించింది.
Advertisement