హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, టీడీపీ ఎన్నికల హామీలను పక్కదోవ పట్టించేందుకే సీఎం చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్షలు చేపట్టారని, హోదా కోసం పోరాట దీక్షలు చేయాలని ఏపీసీసీ నేతలు డిమాండ్ చేశారు. సమైక్య ఉద్యమాలు జరిగిన ప్రదేశాల్లో నవనిర్మాణ దీక్షలు చేసి విభజన గాయాలను గుర్తుచేస్తూ వారం పాటు కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు పిలుపునివ్వడాన్ని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రత్యేక హోదా అమలు కోరుతూ పోరాట దీక్షలు చేయాలని ఏపీసీసీ కమిటీ వారు సూచించారు.
ఇందిరా భవన్ లో గురువారం మాజీ మంత్రులు కాసు కృష్ణారెడ్డి, సాకే శైలజానాథ్, పార్టీ ఉపాధ్యక్షుడు సూర్యా నాయక్, ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ లతో కలిసి గిడుగు రుద్రరాజు మీడియా సమవేశంలో పాల్గొన్నారు. రెండేళ్ల తమ పాలనలో ప్రత్యేక హోదా సాధించలేని తమ అసమర్ధతను కప్పి పుచ్చుకోవడానికి, 2014లో ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన హామీలను మరిపించడానికి కుట్ర పూరితంగా నవనిర్మాణ దీక్షల పేరిట పిలుపునివ్వడం చంద్రబాబు రాజకీయ వ్యూహంలో భాగమని వారు మండిపడ్డారు.
బాబుకు దమ్ము, ధైర్యం ఉంటే హోదా కోసం పోరాడాలి
Published Wed, Jun 1 2016 4:34 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement