
నిరాశ...డబుల్ ఆశ
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు భారీగా దరఖాస్తులు
మరోవైపు వృథాగా జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లు
15,500 మంది ఎదురుచూపులు
ఓ చేతిలో దరఖాస్తు... మరో చేతిలో చంటి పాపతో ఓ మహిళ. మండే ఎండను సైతం లెక్క చేయకుండా చేతి కర్ర సాయంతో గంటల తరబడి వేచి ఉండే వృద్ధురాలు... విధులకు సెలవు పెట్టి కొండంత ఆశతో చాంతాడంత క్యూలో తనవంతు కోసం గంటల తరబడి నిరీక్షించే చిరుద్యోగి... ఇవీ హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టరేట్‌ల వద్ద నిత్యం కనిపించే దృశ్యాలు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు దరఖాస్తులతో రోజూ వేలాది మంది బారులు తీరుతున్నారు. లాఠీ దెబ్బలూ తింటున్నారు.
తమ ప్రాంతాలకు వచ్చే ప్రజాప్రతినిధులనూ ఇదే కోరుతున్నారు. మరోవైపు గ్రేటర్‌లోని 8 ప్రాంతాల్లో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథ కం కింద పేదలకు నిర్మించిన 15,500 ఇళ్లు నాలుగేళ్లుగా వృథాగా పడి ఉన్నాయి. వీటి కోసం లబ్ధిదారులు తమ వాటాగా కొంతమొత్తం చెల్లించి...ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. వీటిని కేటాయించేందుకు ప్రజాప్రతినిధులు...అధికార యంత్రాంగం చొరవ చూపకపోవడంతో నిరాశగా కాలం వెళ్లదీస్తున్నారు. ఈ ఇళ్లను ఇప్పటికైనా కేటాయిస్తే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు కొంతవరకూ ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.