డబుల్.. గుబుల్!
♦ దరఖాస్తు చేసుకున్న కుటుంబాలు 3,61,847
♦ మీసేవా కేంద్రాల ద్వారా వచ్చినవి 2,50,600
♦ కలెక్టరేట్‌లో సమర్పించినవి 91,347
♦ క్షేత్రస్థాయి కార్యాలయాల్లో వచ్చినవి 19,900
♦ రెండు పడక గదుల ఇళ్ల కోసం
♦ కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు
రెండు పడక గదుల ఇళ్లకోసం దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఈ పథకం కింద ఈ ఏడాది ఫిబ్రవరిలో దరఖాస్తుల స్వీకరణకు జిల్లా యంత్రాంగం తెరలేపింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశించినప్పటికీ.. జిల్లా యంత్రాంగం అత్యుత్సాహం ప్రదర్శించి ఈ ప్రక్రియ ప్రారంభించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా డబుల్ బెడ్‌రూమ్ కావాలంటూ ఏకంగా 3.61లక్షల మంది దరఖాస్తు పెట్టుకోవడం గమనార్హం. -సాక్షి, రంగారెడ్డి జిల్లా
రెండు పడక గదుల ఇళ్ల కోసం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు ఇప్పటికే 3.61లక్షల అప్లికేషన్లు స్వీకరించిన యంత్రాంగం పథకంపై ఇంకా స్పష్టత ఇవ్వని సర్కారు.. అయోమయంలో అధికారులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. వాస్తవానికి ఈ పథకం కింద నియోజకవర్గాల వారీగా పరిమిత సంఖ్యలో ఇళ్లను మంజూరు చేసినప్పటికీ నిర్మాణ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఈ సమయంలో జిల్లా యంత్రాంగం దరఖాస్తుల ప్రక్రియకు పూనుకోవడంతో లబ్ధిదారుల్లో ఉత్సాహం కట్టలు తెంచుకున్నట్లైంది. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమాచారమందుకున్న పలువురు అర్జీదారులు కలెక్టరేట్‌కు బారులుదీరారు.
కేవలం వారంరోజుల వ్యవధిలో ఏకంగా 91,347 దరఖాస్తులు అందాయి. జనాల తాకిడిని తట్టుకోలేక కలెక్టరేట్‌లో దరఖాస్తుల ప్రక్రియను నిలిపివేసిన యంత్రాంగం మీసేవా కేంద్రాల ద్వారా తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో జనాలంతా మీసేవా కేంద్రాలకు పరుగెత్తారు. ఈ క్రమంలో మీసేవా కేంద్రాల ద్వారా 2,50,600 దరఖాస్తులు వచ్చినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాకుండా రాష్ట్ర అవతరణ తేదీ నుంచి సాధారణ పద్ధతిలో 19,900 దరఖాస్తులు వచ్చినట్లు అంచనా. మొత్తంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కావాలంటూ జిల్లా వ్యాప్తంగా 3,61,847 మంది దరఖాస్తు చేసుకున్నారు.
గ్రేటర్ పరిధిలోనే అత్యధికం..
జిల్లాలో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లకు సం్బంధించిన దరఖాస్తులు వచ్చాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పది మండలాల్లో ఇప్పటివరకు 2,26,260 మంది మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. గ్రేటర్ పరిధి మినహాయించి 33 మండలాల పరిధిలో 24,340 దరఖాస్తులు అందినట్లు అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుల స్వీకరణ, అర్హు ల ఎంపికపై ప్రభుత్వం స్పష్టత ఇస్తే వీటి సంఖ్య రెట్టింపు కావడం ఖాయమని గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు.