2 పడకల ఇళ్లకు.. 2 లక్షల అర్జీలు
నెల రోజుల్లో 2,35,692 దరఖాస్తులు
ఈ-సేవ కేంద్రాలకు పోటెత్తుతున్న జనం
మండలాలవారీగా దరఖాస్తుల వడపోత
పాత కేటాయింపులకు లబ్ధిదారుల ఎంపిక
4,450 ఇళ్లకు పాలనాపరమైన అనుమతి
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘రెండు పడక గదుల ఇళ్ల’ పథకం సర్కారుకు గుదిబండగా మారుతోంది. సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి దరఖాస్తులు ఇబ్బడిముబ్బడిగా వస్తుండడం జిల్లా యంత్రాంగాన్ని కలవరపరుస్తోంది. నెల రోజుల వ్యవధిలో ఏకంగా 2,35,692 దరఖాస్తులు రావడం.. వీటిని జల్లెడ పట్టడం అధికారులకు కత్తిమీద సాములా పరిణమించనుంది. గూడులేని ప్రతి పేద కుటుంబానికి డబుల్‌బెడ్‌రూం ఇంటిని కేటాయిస్తామని సర్కారు ప్రకటించింది. గ్రేటర్‌లో అనూహ్య విజయం సాధించడంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇదివరకు కేటాయించిన వాటికీ అదనంగా మరో లక్ష ఇళ్లను నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. దీంతో ఇళ్లపై ఆశలు పెంచుకున్న బడుగువర్గాలు దరఖాస్తులు సమర్పించేందుకు కలెక్టరేట్/తహసీల్దార్ కార్యాలయాలకు పోటెత్తారు. ఈ పరిణామంతో ఉక్కిరిబిక్కిరైన జిల్లా యంత్రాంగం.. దరఖాస్తులను ఈ-సేవ కేం ద్రాల్లో సమర్పించే వెసులుబాటు కల్పించింది. కలెక్టరేట్‌లో 1,11,555 దరఖాస్తులు రాగా, ఈ-సేవ/ మీ సే వ కేంద్రాల ద్వారా 1,24,137 అర్జీలందాయి. ఇదే ఒరవడి కొనసాగితే దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.
ఏం చేద్దాం!
డబుల్ బెడ్‌రూం ఇళ్లకు జనం తాకిడి పెరిగిపోవడం.., దరఖాస్తుల సంఖ్య లక్షల్లో రావడంతో జిల్లా యం త్రాం గం దిక్కుతోచని పరిస్థితిలో పడింది. స్థలాలు, నిధుల లభ్యత నేపథ్యంలో వీరందరికి ఇళ్లను సర్దుబాటు చే యడం తలకుమించిన భారం కానుందని ఆందోళన చెందుతోంది. అయితే, ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల వడపోత కార్యక్రమాన్ని మొదలు పెడుతోంది. మండలాలవారీగా వీటిని విభజించి లెక్కగడుతోంది. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కొన్ని అర్జీలు వచ్చినట్లు గుర్తించిన అధికారులు వాటిని ఆ జిల్లా యంత్రాంగానికి పంపే ఏర్పాట్లు చేస్తోంది. వీటి జల్లెడ ప్రక్రియ పూర్తి చేసేలోపు ఈ పథకంపై విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేయకపోతుందా? అని ప్రభుత్వం భావిస్తోంది.
4,450 ఇళ్లకే అనుమతి
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 400 ఇళ్లను కేటాయించిన ప్రభుత్వం.. తాండూరు, మేడ్చల్ సెగ్మెంట్లకు సీఎం కేసీఆర్ తన కోటా నుంచి అదనంగా ఇళ్లను మం జూరు చేశారు. దీంతో డబుల్‌బెడ్‌రూం పథకం కింద జి ల్లాకు 6,850 ఇళ్లు వ చ్చాయి. వీటిలో గ్రామీణ ప్రాంతాలకు 3,610, పట్టణ ప్రాంతాలకు 3,240 ఇళ్లను కేటాయించారు. అయితే, వీటిలో కేవలం 4,450 ఇళ్లకు మా త్రమే పరిపాలనా పరమైన అనుమతి లభించింది. స్థలాలు ఖ రారు కొలిక్కి రాకపోవడంతోనే మిగతా వా టిని మంజూరు చేయలేదని చెబుతున్న అధికారులు.. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి చేసినట్లు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో స్పష్టం చేయడం గమనార్హం. గ్రామాలకు 3,290, పట్టణాలకు 1,160 ఇళ్లను మంజూరు చేసినట్లు శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నతాధికారులకు నివేదించారు. గు ర్తించిన 78 లేఅవుట్లలో మోడల్ కాలనీలు నిర్మించి ల బ్ధిదారులకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి ఇప్పటివరకు లేఅవుట్ల రూపకల్పన పూర్తికాలేదు. అంతేకాకుండా చాలాచోట్ల స్థలాలపై కూడా అభ్యంతరాలు వెల్లువెత్తాయి. లేఅవుట్లను అభివృద్ధి చేసిన త ర్వాతే లబ్ధిదారుల ఎంపికను మొదలు పెట్టాలని, అది కూడా గ్రామ సభల ద్వారా పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. యంత్రాంగం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా లబ్ధిదారుల ప్రక్రియను పూర్తి చేసినట్లు సర్కారుకు నివేదిక సమర్పించడం విచిత్రంగా కనిపిస్తోంది.
అదనంగా వసూలు చేస్తే క్రిమినల్ చర్యలు
డబుల్ బెడ్‌రూం ఇళ్ల దరఖాస్తుల నమోదులో ఈ-సేవ కేంద్ర నిర్వాహకులు నిర్దేశిత ఫీజుకంటే అదనంగా వసూలుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కేంద్రాన్ని మూసివేయడమేకాకుండా.. నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. దరఖాస్తు అప్‌లోడ్‌కు సంబంధించి కేవలం రూ.25 తీసుకోవాలి. కొన్ని చోట్ల అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అలాంటి కేంద్రాల మూసివేతకు వెనుకాడం. - ఆమ్రపాలి, జాయింట్ కలెక్టర్