నేటి నుంచి ఎస్సై పోస్టులకు దరఖాస్తులు
- సిలబస్, విధి విధానాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చిన పీఆర్‌బీ
- ఈసారి సిలబస్‌లో కొత్తగా తెలంగాణ ఉద్యమ చరిత్ర
- దరఖాస్తుపై సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్ నంబర్లు
- ఫైనల్ పేపర్‌లో ‘వెయిటేజీ’పై అభ్యర్థుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఎస్సై కొలువులకు బుధవారం నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ విభాగాల్లోని మొత్తం 539 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ www.tslprb.inలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చైర్మన్ జె.పూర్ణచందర్‌రావు అన్ని ఏర్పాట్లు చేశారు. కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తుకు అనుసరించిన విధానాన్నే అవలంబిస్తున్నారు.
దరఖాస్తు ఫీజుగా జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ.500, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ.250 మీసేవా, ఈసేవ, ఏపీ ఆన్‌లైన్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు వెబ్‌సైట్‌లోని డమ్మీ అప్లికేషన్‌ను ఒకసారి పూర్తి చేసి ఆ తర్వాత.. ఒరిజినల్ దరఖాస్తులోకి వెళ్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దరఖాస్తు సమయంలో సందేహాలు తలె త్తితే నివృత్తి చేయడం కోసం 040-23150362, 040-23150462 హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. ప్రిలిమినరీ పరీక్షకు వారం ముందు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
వెయిటేజీపై అభ్యర్థుల ఆందోళన
ఫైనల్ రాత పరీక్ష విషయంలో రిక్రూట్‌మెంట్ బోర్డు తీసుకున్న నిర్ణయం పట్ల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇందులో పేపర్-1 కింద అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ (200 మార్కులు), పేపర్-2 కింద జనరల్ స్టడీస్ (200 మార్కులు), పేపర్-3 కింద ఇంగ్లిష్ (100 మార్కులు), పేపర్-4 కింద తెలుగు లేదా ఉర్దూ (100 మార్కులు)లకు పరీక్ష నిర్వహించనున్నారు. ఇంగ్లిష్, తెలుగు లేదా ఉర్దూ పరీక్షలలో వచ్చిన మార్కులకు వెయిటేజీ ఇవ్వనున్నట్లు బోర్డు పేర్కొంది. గతంలో ఈ రెండు పేపర్లలలో అర్హత సాధిస్తే సరిపోయేది. కానీ ఈ సారి వెయిటేజీ ఇవ్వడాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై బోర్డు పునరాలోచన చేయాలని కోరుతున్నారు. ఇక ప్రిలిమినరీ, ఫైనల్ రాత పరీక్షకు సంబంధించిన సిలబస్‌ను రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. గతంలో ఉన్న సిలబస్‌కు అదనంగా తెలంగాణ ఉద్యమ చరిత్రను చేర్చారు.