PRB
-
సీనియర్ సిటిజన్స్‌కు ఆరోగ్య బీమా భరోసా
దేశీయంగా వయస్సు పైబడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పీఆర్బీ గణాంకాల ప్రకారం 2050 నాటికి 14.4 కోట్ల మంది పైచిలుకు సీనియర్ సిటిజన్స్ ఉంటారని అంచనా. ఈ నేపథ్యంలో వారి ఆరోగ్యానికి, సంక్షేమానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మన కుటుంబాల్లో కూడా పెద్దవారికి నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఆరోగ్య బీమా అవసరం ఎంతైనా ఉంది. సీనియర్ సిటిజన్స్ కోసం ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు వారి అవసరాలను దృష్టిలోఉంచుకోవాలి. ఇందుకోసం అయిదు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ► వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉండాలి: ఆరోగ్యబీమా పాలసీ కవరేజీ సమగ్రంగా ఉండేలా చూసుకోవాలి. తక్కువ వెయిటింగ్ పీరియడ్, అలాగే ఎలాంటి మెడికల్ చెకప్‌లు అవసరం లేకుండా అప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలకు కూడా కవరేజీ లభించేలా చూసుకోవాలి. ఉదాహరణకు, మణిపాల్ సిగ్నా అందించే ప్రైమ్ సీనియర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది సీనియర్ల విభిన్న ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినది. ఎటువంటి మెడికల్ చెకప్‌లు అవసరం లేకుండా 91వ రోజు నుంచే ప్రీ–ఎగ్జిస్టింగ్ అనారోగ్య పరిస్థితులకు కవరేజీని అందిస్తుంది. ► కో–పే, ఉప–పరిమితులు ఉండొద్దు: కో–పే, ఉప–పరిమితులు ఉండని హెల్త్ ప్లాన్ ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే సబ్–లిమిట్ ఉన్న ప్లాన్ వల్ల మళ్లీ మన జేబుపై భారం పడుతుంది. పాలసీ పరిధిలోకి రాని కొన్ని ఖర్చులను మనమే భరించాల్సి వస్తుంది. ► అపరిమితంగా సమ్ ఇన్సూర్డ్ పునరుద్ధరణ: ఆరోగ్య బీమాలో పరిగణనలోకి తీసుకోతగిన మరో పెద్ద అంశం ఏమిటంటే, సమ్ ఇన్సూర్డ్‌ను అపరిమితంగా రీస్టోర్ చేసే అవకాశం. ఉదాహరణకు మీరు ఏదైనా నిర్దిష్ట అనారోగ్యానికి సంబంధించిన, లేక దానికి సంబంధించని మరోదాని కోసమైనా కొత్తగా క్లెయిమ్ చేసినప్పుడు, మీ హెల్త్ ప్లాన్ తప్పకుండా సమ్ ఇన్సూర్డ్ 100 శాతం పునరుద్ధరించేటువంటిదై ఉండాలి. ► క్యుములేటివ్ బోనస్: క్లెయిమ్స్ గానీ దాఖలు చేయని పక్షంలో కొన్ని ఆరోగ్య బీమా పాలసీల్లో సమ్ ఇన్సూర్డ్కి ఏటా 10 శాతం మేర క్యుములేటివ్ బోనస్ జతవుతుంటుంది. సమ్ ఇన్సూర్డ్కి 100 శాతం స్థాయికి చేరే వరకు ఈ బోనస్ ఏటా జతవుతూనే ఉంటుంది. ఫలితంగా పదేళ్లలో ఎలాంటి అదనపు ఫీజు లేకుండానే కవరేజీ రెట్టింపవుతుంది. ► ప్రివెంటివ్ చెకప్: తీవ్రమైన అనారోగ్యాలు ఉన్న వయో వృద్ధులు తరచుగా వైద్యులను సంప్రదించాల్సి వస్తుంటుంది. అపాయింట్మెంట్లు లభించడం కొన్ని సందర్భాల్లో కష్టం కావచ్చు. కాబట్టి బీమా సంస్థల నెట్వర్క్ పరిధిలోని డాక్టర్లు, స్పెషలిస్టులతో అపరిమిత టెలీకన్సల్టేషన్స్ (ఫోన్ లేదా చాట్ ద్వారా) సదుపాయం ఇచ్చే ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిది. అలాగే ఏటా నగదురహిత హెల్త్ చెకప్ అందించేదిగా కూడా పాలసీ ఉండాలి. ప్రతి ఒక్కరి ఆరోగ్య అవసరాలు వివిధ రకాలుగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. వివిధ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు, వాటి ఫీచర్లు, వ్యయాలను జాగ్రత్తగా పోల్చి చూసుకోవాలి. సీనియర్ సిటిజన్స్‌కు శారీరకంగాను, ఆర్థికంగాను ప్రయోజనకరంగా ఉండే సమగ్రమైన ఆరోగ్య బీమా కవరేజీని అందించే పాలసీని ఎంచుకోవాలి. – ప్రియా గిల్భిలే, సీవోవో, మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ -
అక్టోబర్‌లో ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలు!
రెండు రోజుల్లో తేదీలను ప్రకటించనున్న పీఆర్బీ సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే ప్రిలిమినరీ, దేహ దారుఢ్య పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో... ఉన్నతాధికారుల నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే అక్టోబర్ చివరి వారంలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్సై), కానిస్టేబుల్ పోస్టులకు తుది రాత పరీక్షలు నిర్వహించాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (పీఆర్బీ) నిర్ణయించింది. ఈ మేరకు రెండు రోజుల్లోనే తేదీలను అధికారికంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో తొలుత కానిస్టేబుల్ పరీక్షను, తర్వాత ఎస్సై పోస్టుల పరీక్షలను నిర్వహించనుంది. అయితే, తుది పరీక్షల్లో ఒక్కో కానిస్టేబుల్ పోస్టుకు దాదాపు 9 మంది పోటీపడనున్నారు. వివిధ విభాగాల్లో కలిపి మొత్తంగా 9,613 కానిస్టేబుల్ పోస్టులు ఉండగా.. దేహ దారుఢ్య పరీక్షల అనంతరం తుది రాతపరీక్షకు 81 వేల మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు. కాగా, వివిధ విభాగాల్లోని 539 ఎస్సై పోస్టులను భర్తీ చేయనుండగా... దేహ దారుఢ్య పరీక్షల అనంతరం 32,457 మంది అర్హత సాధించారు. అంటే ఒక్కో పోస్టుకు సగటున 60 మంది పోటీ పడుతున్నారు. -
నేటి నుంచి ఎస్సై పోస్టులకు దరఖాస్తులు
- సిలబస్, విధి విధానాలను వెబ్సైట్లో పొందుపర్చిన పీఆర్బీ - ఈసారి సిలబస్‌లో కొత్తగా తెలంగాణ ఉద్యమ చరిత్ర - దరఖాస్తుపై సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్ నంబర్లు - ఫైనల్ పేపర్లో ‘వెయిటేజీ’పై అభ్యర్థుల ఆందోళన సాక్షి, హైదరాబాద్: ఎస్సై కొలువులకు బుధవారం నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ విభాగాల్లోని మొత్తం 539 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ www.tslprb.inలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చైర్మన్ జె.పూర్ణచందర్రావు అన్ని ఏర్పాట్లు చేశారు. కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తుకు అనుసరించిన విధానాన్నే అవలంబిస్తున్నారు. దరఖాస్తు ఫీజుగా జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ.500, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ.250 మీసేవా, ఈసేవ, ఏపీ ఆన్లైన్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు వెబ్‌సైట్‌లోని డమ్మీ అప్లికేషన్‌ను ఒకసారి పూర్తి చేసి ఆ తర్వాత.. ఒరిజినల్ దరఖాస్తులోకి వెళ్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దరఖాస్తు సమయంలో సందేహాలు తలె త్తితే నివృత్తి చేయడం కోసం 040-23150362, 040-23150462 హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. ప్రిలిమినరీ పరీక్షకు వారం ముందు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వెయిటేజీపై అభ్యర్థుల ఆందోళన ఫైనల్ రాత పరీక్ష విషయంలో రిక్రూట్మెంట్ బోర్డు తీసుకున్న నిర్ణయం పట్ల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇందులో పేపర్-1 కింద అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ (200 మార్కులు), పేపర్-2 కింద జనరల్ స్టడీస్ (200 మార్కులు), పేపర్-3 కింద ఇంగ్లిష్ (100 మార్కులు), పేపర్-4 కింద తెలుగు లేదా ఉర్దూ (100 మార్కులు)లకు పరీక్ష నిర్వహించనున్నారు. ఇంగ్లిష్, తెలుగు లేదా ఉర్దూ పరీక్షలలో వచ్చిన మార్కులకు వెయిటేజీ ఇవ్వనున్నట్లు బోర్డు పేర్కొంది. గతంలో ఈ రెండు పేపర్లలలో అర్హత సాధిస్తే సరిపోయేది. కానీ ఈ సారి వెయిటేజీ ఇవ్వడాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై బోర్డు పునరాలోచన చేయాలని కోరుతున్నారు. ఇక ప్రిలిమినరీ, ఫైనల్ రాత పరీక్షకు సంబంధించిన సిలబస్‌ను రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో పొందుపరిచింది. గతంలో ఉన్న సిలబస్‌కు అదనంగా తెలంగాణ ఉద్యమ చరిత్రను చేర్చారు.