అక్టోబర్‌లో ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలు!
రెండు రోజుల్లో తేదీలను ప్రకటించనున్న పీఆర్‌బీ
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే ప్రిలిమినరీ, దేహ దారుఢ్య పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో... ఉన్నతాధికారుల నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే అక్టోబర్ చివరి వారంలో సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్సై), కానిస్టేబుల్ పోస్టులకు తుది రాత పరీక్షలు నిర్వహించాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (పీఆర్‌బీ) నిర్ణయించింది. ఈ మేరకు రెండు రోజుల్లోనే తేదీలను అధికారికంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో తొలుత కానిస్టేబుల్ పరీక్షను, తర్వాత ఎస్సై పోస్టుల పరీక్షలను నిర్వహించనుంది. అయితే, తుది పరీక్షల్లో ఒక్కో కానిస్టేబుల్ పోస్టుకు దాదాపు 9 మంది పోటీపడనున్నారు.
వివిధ విభాగాల్లో కలిపి మొత్తంగా 9,613 కానిస్టేబుల్ పోస్టులు ఉండగా.. దేహ దారుఢ్య పరీక్షల అనంతరం తుది రాతపరీక్షకు 81 వేల మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు. కాగా, వివిధ విభాగాల్లోని 539 ఎస్సై పోస్టులను భర్తీ చేయనుండగా... దేహ దారుఢ్య పరీక్షల అనంతరం 32,457 మంది అర్హత సాధించారు. అంటే ఒక్కో పోస్టుకు సగటున 60 మంది పోటీ పడుతున్నారు.