సాక్షి, హైదరాబాద్: మత్స్యకారులను సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ ఆక్వా ఎగ్జిబిషన్ (ఆక్వాక్స్) ఏర్పాటు చేయనున్నట్లు మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. సొసైటీ ఫర్ ఇండియన్ ఫిషరీస్ ఆక్వా కల్చర్ సంస్థ సహకారంతో మార్చి 15 నుంచి 18 వరకు హైదరాబాద్ లోని హెచ్‌ఐసీసీలో నిర్వహిస్తామన్నారు.
బుధవారం సచివాలయంలో ఆక్వాక్స్ ఇండియా– 2018 పోస్టర్‌ను మంత్రి ఆవిష్కంచారు. దక్షిణ ఆసియాలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఆక్వాక్స్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో సుమారు 25 దేశాల ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల చేపల పెంపకందారులు హాజరుకానున్నారని చెప్పారు. కొత్త జాతులు ఉత్పత్తి, యంత్ర సామగ్రి, ఉత్తమ మార్కెటింగ్ పద్ధతులు, నాణ్యతపై అవగాహన కల్పించనున్నట్లు తలసాని అన్నారు.
కార్యక్రమంలో పశుసంవర్ధక, మత్స్య శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ, సొసైటీ ఫర్ ఇండియన్ ఫిషరీస్ ఆక్వా కల్చర్ (ఎస్‌ఐఎఫ్‌ఏ) ప్రెసిడెంట్ రామచంద్రరాజు, సీఈవో వేణు దంతులూరి, డైరెక్టర్ సమీర్ పాత్ర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment