అక్వేరియం ఏమైనట్టు!.. రెండు సార్లు టెండర్లు పిలిచినా స్పందన | aqua marine park in hyderabad | Sakshi
Sakshi News home page

అక్వేరియం ఏమైనట్టు!.. రెండు సార్లు టెండర్లు పిలిచినా స్పందన

Published Tue, Aug 6 2024 9:48 AM | Last Updated on Tue, Aug 6 2024 9:59 AM

aqua marine park in hyderabad

సాక్షి, హైదరాబాద్: అక్వా మెరైన్‌ పార్కు..హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టన్నెల్‌ అక్వేరియం ప్రాజెక్టు ఇది. కొత్వాల్‌గూడ ఎకో పార్కులో అత్యాధునిక హంగులతో అక్వేరియం నిర్మాణానికి హెచ్‌ఎండీఏ అప్పట్లో ప్రణాళికలను రూపొందించింది. ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని తలపెట్టింది. కానీ ఏళ్లు గడిచినా ఆ ప్రాజెక్టు ఆచరణకు నోచలేదు.

 పబ్లిక్, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో నిరి్మంచాలని భావించారు. రెండుసార్లు టెండర్లు కూడా ఆహా్వనించారు.      కానీ నిర్మాణ సంస్థల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. ప్రస్తుతం ఎకోపార్కు తుది దశకు చేరుకుంది. కానీ టన్నెల్‌ అక్వేరియం ఏర్పాటు మాత్రం పెండింగ్‌ జాబితాలో పడిపోయింది. కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఇటీవల హెచ్‌ఎండీఏ చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను, పార్కులను పరిశీలించారు. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో ప్రతిపాదించిన టన్నెల్‌ అక్వేరియంపైన ప్రస్తుతం ఎలా ముందుకు వెళ్లనున్నదనేది చర్చనీయాంశంగా మారింది. సుమారు రూ.150 కోట్లతో ప్రతిపాదించిన అక్వేరియం ప్రతిపాదన ఉన్నట్లా? లేనట్టా అనే అంశంపైనా సందిగ్ధం నెలకొంది. 

నగర పర్యాటకానికి మణిహారం....  
హిమాయత్‌సాగర్‌కు చేరువలో హెచ్‌ఎండీఏ 85 ఎకరాల విస్తీర్ణంలో కొత్వాల్‌గూడ ఎకోపార్కు నిర్మాణం చేపట్టింది. నగరవాసులకు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు ఒక అందమైన, ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించే విధంగా పార్కును విస్తరించారు. ఈ పార్కులోనే సుమారు 4.27 ఎకరాల్లో టన్నెల్‌ అక్వేరియం ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టారు. 

ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అక్వేరియంలపైన అధికారులు అధ్యయనం కూడా చేశారు. ఇప్పటి వరకు ఉన్న అన్ని అక్వా మెరైన్‌ పార్కుల కంటే  మరిన్ని ఆధునిక హంగులతో దీన్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. కానీ పీపీపీ పద్ధతిలో ప్రతిపాదించిన ఈ భారీ అక్వేరియం నిర్మాణానికి కాంట్రాక్టు సంస్థలు ముందుకు రాలేదు. గత సంవత్సరం రెండుసార్లు టెండర్లు పిలిచారు. స్పందన రాకపోవడంతో కొంతమంది ఆసక్తి కలిగిన డెవలపర్లతో ప్రీ బిడ్‌ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ వారి నుంచీ పెద్దగా స్పందన కనిపించలేదు. 

 దీంతో ఈ ప్రాజెక్టు పెండింగ్‌ జాబితాలో పడిపోయింది. దీనిపై మరోసారి ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపైన అధికారులు ప్రస్తుతం సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టును పూర్తిగా పెట్టేయడమా లేక, మరోసారి ఆసక్తి ఉన్న నిర్మాణ సంస్థల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి విధి విధానాల్లో మార్పులు చేయడమా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినట్లు అధికారులు తెలిపారు. కొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్టుపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  

రంగు రంగుల చేపలతో... 
 ⇒ కొత్వాల్‌గూడ ఎకో పార్కు ఏర్పాటు కోసం, చెన్నై వీజీటీ మెరైన్‌పార్కు, అహ్మదాబాద్‌ సైన్స్‌సిటీ ప్రాజెక్టులపైన అధికారులు అధ్యయనం చేశారు. ఆ తరువాత దేశంలోనే అతి పెద్ద టన్నెల్‌ పార్కుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. 
 ⇒ వేయి రకాల రంగు రంగుల చేపలు, మెరైన్‌ స్పీసెస్, బహుళ టన్నెల్స్‌తో ఈ మెగా అక్వా మెరైన్‌ పార్కును అందంగా తీర్చి దిద్దాలని భావించారు. షార్క్‌ చేపల నుంచి డాలి్ఫన్‌ల వరకు ఉంటాయి. ఇది సందర్శకులకు ఒక అద్భుతమైన అనుభూతినిచ్చే విధంగా, అతి పెద్ద జలాశయం అడుగున పర్యటిస్తూ వీక్షిస్తున్న అనుభూతి కలిగించే విధంగా ఉంటుంది. 
 ⇒  అలాగే అక్వేరియంను దగ్గరి నుంచి వీక్షించేందుకు అనుగుణంగా ఒక రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 
 ⇒   అతి పెద్ద డోమ్‌ థియేటర్, సెవెన్‌ డీ థియేటర్, వర్చువల్‌ అక్వేరియం, టచ్‌ ట్యాంక్స్, హెల్మెట్‌ అక్వేరియం వంటివి ఏర్పాటు చేసేందుకు సైతం అప్పట్లో  ప్రణాళికలను  రూపొందించారు. 
 ⇒ పిల్లల కోసం కియోస్‌్కలను  కూడా ఏర్పాటు 
చేయవలసి ఉంటుంది.  
 ⇒  కనీసం 2500 మంది ఒకేసారి సందర్శించేందుకు వీలుగా సుమారు 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని భావించారు. అక్వేరియంలో ఏర్పాటు చేసే టన్నెల్‌ ట్యాంక్‌ మలుపు 180 డిగ్రీల కోణంలో ఉంటుంది.   
 ⇒   కనీసం 100 మీటర్ల పొడవు, 3.5 మీటర్ల వెడల్పు 
వాక్‌ వేలతో టన్నెల్స్‌ను ఏర్పాటు చేయాలని 
ప్రతిపాదించారు.  
 ⇒   మొత్తం అక్వేరియం సుమారు 3 వేల మిలియన్‌ లీటర్ల నీటి సామర్థ్యానికి తగ్గకుండా ఏర్పాటు చేయాలని  
నిర్ణయించారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement