నకిలీ నక్సలైట్ అరెస్టు...
- ఎనిమిది ఆయుధాలు, 50 బుల్లెట్లు స్వాధీనం
- జడల నాగరాజుకు దగ్గరి బంధువు
కరీంనగర్ క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఆయుధాలు చూపుతూ బెదిరింపులకు పాల్పడుతున్న నకిలీ నక్సలైట్ తోట రాములును అరెస్టు చేసి అతని నుంచి ఎనిమిది ఆయుధాలు, 50 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ వీబీ.కమలాసన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి ఈ మేరకు వివరాలను వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం కేశనపల్లికి చెందిన తోట రాములు(36) మాజీ నక్సలైట్ జడల నాగరాజుకు దగ్గరి బంధువు. ఇద్దరు కలసి పలు సెటిల్‌మెంట్లు, బెదిరింçపులకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి.
ఆ సమయంలో జడల నాగరాజుపై పోలీసుల నిఘా పెరగడంతో తనవద్ద ఉన్న ఆయుధాలను దాచాలని రాములుకు అప్పగించాడు. 2012లో జడల నాగరాజు అనూహ్యంగా అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత రాములు తన వద్ద ఉన్న ఆయుధాలు చూపిస్తూ పలుచోట్ల సెటిల్‌మెంట్లు చేయడం మొదలుపెట్టాడు. రాములు ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న సమాచారంతో 2015 మేలో కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేసి అతనిపై క్రైం నంబర్ 232/16 కేసు నమోదు చేశారు. అతడి నుంచి అధునాతమైన జర్మన్ మేడ్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. జైలునుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రాములు పలు భూ పంచాయితీల్లో తలదూర్చి బెదిరింపులకు గురిచేసి రూ.లక్షలు వసూలు చేశాడు.
ఇటీవల కమిషనరేట్ ఏర్పాటు చేసిన తర్వాత కమిషనర్ కమలాసన్‌రెడ్డి కార్డెన్ సెర్చ్‌లు ప్రారంభించారు. తనిఖీల్లో ఆయుధాలు బయటపడతాయనే భయంతో వాటిని కరీంనగర్ మండలం తీగలగుట్లపల్లి గ్రామం విద్యారణ్యపురి కాలనీలో సమీపంలో ఉంటున్న తన అన్న ఇంటి సమీపంలో గల ముళ్ల పొదలున్న స్థలంలో 200 మీటర్ల లోతున దాచి పెట్టాడు. తన బెదిరింపులకు అప్పుడప్పుడు డంపులో ఉన్న ఆయుధాలు వినియోగించేవాడు. ఈ సమాచారంతో తోట రాములుపై పోలీసులు పక్కాగా నిఘా పెట్టారు. శుక్రవారం ఉదయం రాములు అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా డంపు విషయం బయటపడింది. ఆ డంపులో నుంచి ఒక 8ఎంఎం రైఫిల్, ఎస్‌బీబీఎల్ (సింగిల్‌బోర్ తుపాకీ) ఒకటి, డబుల్‌బోర్ తుపాకీలు మూడు, 9ఎంఎం కార్బన్ గన్ ఒకటి, 32పిస్టల్ ఒకటి, ఒక 8ఎంఎం తపంచాతోపాటు 50 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.