
జనవరి నుంచి ఆధార్‌తోనే ‘ఆసరా’
సామాజిక భద్రతా పింఛన్ పథకం‘ఆసరా’కు ఆధార్‌ను అనుసంధానించే ప్రక్రియను నూరుశాతం అమల్లోకి తేవాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నిర్ణయించింది.
సాక్షి, హైదరాబాద్: సామాజిక భద్రతా పింఛన్ పథకం‘ఆసరా’కు ఆధార్‌ను అనుసంధానించే ప్రక్రియను నూరుశాతం అమల్లోకి తేవాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నిర్ణయించింది. ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద ఆసరా పింఛన్ పొందుతున్న 35,58,486 మందిలో ఇప్పటికే 99.32 శాతం మంది తమ ఆధార్‌తో అనుసంధానమైనట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. దీంతో మిగిలిన 24,265 (0.68 శాతం) మందిని కూడా ఆధార్‌తో అనుసంధానించేందుకు అధికారులు అన్ని జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ విషయమై ఇప్పటికే అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులకు, అన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు సెర్ప్ నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్లు తె లుస్తోంది.
జనవరి నుంచి ఆధార్ పక్రియను పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చేందుకు సెర్ప్ యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం మొత్తం ఆసరా లబ్ధిదారుల్లో 37 శాతం మందికి బ్యాంకు ఖాతాల ద్వారా, 50 శాతం మందికి పోస్టాఫీసుల ద్వారా పింఛన్ సొమ్మును అందిస్తుండగా మిగిలిన 13 శాతం మందికి పంచాయతీ కార్యదర్శులే నేరుగా అందిస్తున్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మాన్యువల్‌గా పింఛన్ పంపిణీ చేసే ప్రాంతాల్లో ఎక్కడోచోట అవక తవకలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును వారి బ్యాంకు ఖాతా లేదా పోస్టాఫీసుల ద్వారానే అందజేయాలని తాజాగా నిర్ణయించిన సెర్ప్... ఇందుకు ఆధార్‌ను అనుసంధానించనుంది.