మండలంలో మొత్తం జనాభా.. 49,950 అధికారుల లెక్కల ప్రకారం జారీ అయిన ఆధార్ కార్డులు.. 54,204
కాకి లెక్కలు!
Published Sun, Jan 19 2014 2:56 AM | Last Updated on Fri, May 25 2018 6:12 PM
హిరమండలం, న్యూస్‌లైన్: మండలంలో మొత్తం జనాభా.. 49,950
అధికారుల లెక్కల ప్రకారం జారీ అయిన ఆధార్ కార్డులు.. 54,204
అంటే.. ఉన్నవారి కంటే కార్డులే ఎక్కువన్నమాట..
దీని ప్రకారం కార్డు లేదని ఎవరూ చెప్పడానికి లేదన్నమాట.. ఇంకా చెప్పాలంటే సుమారు 4వేల మందికి రెండేసి కార్డులు కూడా ఉండి ఉండవచ్చు.
మరి అదేమిటి?.. సుమారు 20 శాతం మంది ఆధార్ కార్డు లేదని అవస్థలు పడుతున్నారే?!
అక్కడే ఉండి మతలబు.. పై గణాంకాలు చూస్తే.. ఎవరికైనా ఆ మతలబేంటో.. అధికారులు ఎలా కాకి లెక్కలు వేస్తున్నారో.. ఇట్టే అర్థమైపోతుంది. ఉన్న జనాభా కంటే ఎక్కువ మందికే ఆధార్ కార్డులు ఇచ్చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతుండగా.. హిరమండలం మండలంలో వాస్తవ పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. జనాభా కంటే ఎక్కువ కార్డులు జారీ కావడం కూడా తప్పేనన్న విషయం పక్కన పెడితే.. వాస్తవంగా ఉన్న వారిలో సుమారు 20 శాతం మంది ఆధార్ కార్డులు లేక సంక్షేమ పథకాలకు దూరమవుతున్నామని ఆందోళన చెందుతున్నారు. వృద్ధాప్యంలో మాకీ కార్డు కష్టాలేమిటని వృద్ధులు సైతం ఆవేదన చెందుతున్నారంటేనే ఆధార్ అవస్థలు ఎలా ఉన్నాయో స్పష్టమవుతుంది. ఆధార్ కార్డును తప్పనిసరి చేయవద్దని కోర్టులు ఆదేశించినా.. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.
అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆధార్‌తో లింకు పెడుతున్నాయి. అది ఉంటేనే సంక్షేమ ఫలాలు అందుతాయని చేతల్లో స్పష్టం చేస్తున్నాయి. విద్యార్థుల స్కాలర్‌షిప్పులు, సామాజిక పింఛన్లు, బ్యాంకు ఖాతా తెరవడం, రేషన్ కార్డు, వంట గ్యాస్.. ఇలా ఒకటేమిటి.. అన్ని పథకాలకూ ఆధార్ తప్పనిసరి చేస్తూ పోతుండటంతో ఆ కార్డు కోసం ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తు గడువు త్వరలో ముగుస్తుంది. ఆధార్ నెంబర్ ఉంటే తప్ప దరఖాస్తు చేసుకోవాడానికి లేదు. ఎన్‌రోల్‌మెంట్ రసీదు ఆధారంగా నెట్‌లో ఆధార్ కార్డులు తీసుకునేందుకు పలుమార్లు తిరుగుతున్నప్పటికీ ఫలితముండటం లేదు.
ఇబ్బందులు ఇవీ..
దుగ్గుపురం పంచాయతీలో 1200 జనాభా ఉండగా 400 మందికి ఆధార్ కార్డుల్లేవు. వీరిలో 50 మంది పెన్షనర్లు ఉన్నారు. ఆధార్ కార్డు లేక ప్రతి నెలా పెన్షన్ తీసుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. పాడలి, తులగాం, హిరమండ లం, ధనుపురం, తంప, కొండరాగోలు, గులుమూరు, అక్కరాపల్లి, కిట్టాలపాడు, చొర్లంగితో పాటు మరికొన్ని పంచాయతీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మండలంలో పాఠశాల నుంచి కళాశాల స్థాయి వరకు 8వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో సుమారు 2వేల మంది ఇంటర్, డీగ్రీ, పదో తరగతి స్థాయిలో ఉన్నారు. వీరిలో చాలామంది ఆధార్ కార్డులు లేక ఉపకార వేతనాలు పొందడంలో ఇబ్బందులు పడుతున్నారు.
ప్రతి పంచాయతీలో 10 మంది దీపం లబ్ధిదారులతోపాటు పలువురు వినియోగదారులు ఆధా ర్ లేక అనుసంధానం చేసుకోలేకపోతున్నారు.
Advertisement
Advertisement