ప్రభుత్వ పథకాలన్నింటికీ ఆధార్ సంఖ్యను తప్పని సరి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
జిల్లా కలెక్టర్లకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రభుత్వ పథకాలన్నింటికీ ఆధార్ సంఖ్యను తప్పని సరి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ‘ఆసరా’ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ నంబర్‌ను అనుసంధానించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. తాజాగా సెర్ప్ సీఈవో నీతుకుమారి ప్రసాద్ కలెక్టర్లకు లేఖ రాశారు. ఆధార్ కార్డుల జారీలో తెలంగాణ దేశంలోనే అగ్ర స్థానంలో ఉన్నా, బ్యాంకు అకౌంట్లతో వాటిని అనుసంధానించడంలో మాత్రం వెనుకబడి ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా 15,40,624 మంది ఆసరా పింఛన్‌దారులుండగా.. అందులో 3,93,194 మంది ఖాతాలకే ఆధార్ అనుసంధానమైంది. జనగామ, కామారెడ్డి, కుమ్రంభీం, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్, మెదక్, జోగుళాంబ గద్వాల, వికారాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఒక్క ఖాతాకూ ఆధార్‌ను జోడించలేదు. కరీంనగర్, నల్లగొండ, వరంగల్ గ్రామీణ, రంగారెడ్డి జిల్లాల్లో వందశాతం సీడింగ్ జరిగింది.