సర్కారు పరార్ | Assembly heat on land scam | Sakshi
Sakshi News home page

సర్కారు పరార్

Published Thu, Mar 10 2016 1:54 AM | Last Updated on Sat, Aug 18 2018 9:30 PM

సర్కారు పరార్ - Sakshi

సర్కారు పరార్

♦ రాజధాని భూదందాపై విచారణకు వెనుకంజ  
♦ భూకుంభకోణంపై దద్దరిల్లిన అసెంబ్లీ
 
 సాక్షి, హైదరాబాద్: రాజధాని భూ కుంభకోణంపై బుధవారం రాష్ట్ర శాసనసభ దద్దరిల్లింది. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికార పక్షం పూర్తి ఆత్మరక్షణలో పడింది. గవర్నరు ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాజధాని భూదందాపై ప్రతిపక్ష నేత చేసిన ఆరోపణలకు అధికారపక్షం నుంచి సరైన సమాధానమే లేకపోయింది. సీఎం, మంత్రులు, అధికార పక్ష సభ్యులు ఒకరి తర్వాత ఒకరు జగన్‌పై ఎదురుదాడికి దిగారు. ‘గుడ్డ కాల్చి మొహాన వేయడం కాదు. తమాషా కాదు. ఇద్దరు మంత్రులపై ఆరోపణలు చేశారు.  ఆరోపణలను ఫ్రూవ్ చేయాలి. లేదంటే జగన్‌పై చర్యలు తీసుకోవాలి. అప్పటివరకు సభ ముందుకెళ్లే ప్రశ్నేలేదు....’ అంటూ సీఎం ఆవేశంతో ఊగిపోయారు. 

పలువురు మంత్రులు, అధికార పక్ష సభ్యులు కూడా జగన్‌పై ఎదురుదాడికి దిగారు. వారికి జగన్ సరైన సమాధానమిచ్చారు. ‘అసలు నిందితుడు మీరే... ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేసింది మీరు. విచారణ జరపాల్సింది మీ మీద. రాజధాని ఎక్కడ వస్తుందో మీ అనుయాయులకు, మంత్రులకు లీకులిచ్చి వారు బినామీ పేర్లతో చౌకగా భూములు కొనుగోలు చేయడానికి వీలు కల్పించారు. పదవీ బాధ్యతల స్వీకారం సందర్భంగా చేసిన ప్రమాణం (ఓత్ ఆఫ్ సీక్రెసీ)కి తిలోదకాలిచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో మీమీదే విచారణ జరగాలి.

దమ్ముంటే సీబీఐ విచారణకు ఆదేశించండి.’ అని జగన్ పట్టుబట్టారు. ఔటర్ రింగ్‌రోడ్‌పై నిరాధార ఆరోపణలని తెలిసినా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. దాంతో అధికారపక్షం అయోమయంలో పడిపోయింది. ఊహించని ప్రతిసవాల్‌కు ముఖ్యమంత్రి, మంత్రుల నుంచి సమాధానమే లేకపోయింది. రాజధాని భూ కుంభకోణంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులంతా నినాదాలు చేశారు.  విపక్షానిదే పైచేయి అవుతుండటంతో ఇక చర్చ జరిగితే మరింత అభాసుపాలవుతామని నిర్ధారణకు వచ్చిన అధికార పక్షం చర్చ పక్కదోవ పట్టిందనే సాకు చూపించి రూల్ 329 కింద ముగింపు తీర్మానం పెట్టి అర్ధంతరంగా చర్చకు పుల్ స్టాప్ పెట్టింది. గవర్నరు ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపైనే ప్రసంగిస్తానని విపక్ష నేత ప్రకటించి మాట్లాడుతున్నా పట్టించుకోకుండా చర్చ కొనసాగించడానికి వీలు లేదంటూ ఆర్థిక మంత్రి యనమల ఈ తీర్మానం తెరపైకి తెచ్చారు. చివరకు విపక్ష సభ్యులను సభ నుంచి ఒక రోజు సస్పెండ్ చేసి బయటకు పంపించి గవర్నరు ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పారు.

  సస్పెండ్ చేసి ఊపిరి పీల్చుకున్న అధికారపక్షం
 చర్చ ముగించే తీర్మానం వద్దని, గవర్నరు ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే అంశంపై మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలంటూ తమ తమ స్థానాల్లో నిలబడి వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు డిమాండు చేశారు. బీజేపీ నేతలు కూడా ఇదే విజ్ఞప్తి చేశారు. అయినా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వీలుకాదని తేటతెల్లం చేయడంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు వెల్‌లోకి వెళ్లి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ నినాదాలు చేశారు. దీంతో  ఏమి చేయాలో పాలుపోక అధికార పక్ష సభ్యులు కొద్దిసేపు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. చివరకు సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నందున విపక్ష సభ్యులను సస్పెండ్ చేయాలంటూ మంత్రి యనమల తీర్మానం ప్రవేశపెట్టారు. వైఎస్సార్‌సీపీ సభ్యులను బుధవారం ఒక్కరోజు సస్పెండ్ చేసినట్లు ప్రకటించడంతో ఆ పార్టీ సభ్యులు బయటకు వెళ్లారు.

  విపక్షానిదే పైచేయి...
 అంతకుముందు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా తెలుగుదేశం పాలనను ఎండగడుతూ ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతి అంశానికి సంబంధించి అన్ని వివరాలు, అధికారిక గణాంకాలతో సోదాహరణంగా వివరిస్తుంటే అధికారపక్షం తీవ్ర గందరగోళంలో పడిపోయింది. సమాధానమిచ్చే నెపంతో అడుగడుగునా ఆటంకాలు కలిగించింది. జగన్ మాట్లాడిన సమయం కంటే ఆయన ప్రసంగానికి ఆటంకాలు కలిగించిన సమయం ఎక్కువ ఉందంటే అధికారపక్షం ఎంత ఆందోళన పడిందో అర్ధమౌతుంది. పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేకహోదా వంటి అంశాలపై జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు అధికారపక్షం సమాధానం చెప్పలేక నీళ్లు నమిలింది. మంత్రులు పొంతనలేని సమాధానాలిచ్చారు.

వైస్సార్‌సీపీ నుంచి జగన్ ఒక్కరే మాట్లాడినా అధికార పక్షం నుంచి సీఎం చంద్రబాబు, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు, యనమల రామకృష్ణుడు, చీఫ్ విప్ కాలువ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, బోండా ఉమామహేశ్వరరావు, బుచ్చయ్య చౌదరి, గొల్లపల్లి సూర్యారావు తదితరులు ఒకరి వెంట ఒకరు జగన్‌పై ఎదురుదాడికి దిగారు. తప్పు చేయకపోతే సీబీఐ విచారణకు ఆదేశించడానికి  ఎందుకు భయపడుతున్నారని విపక్షనేత జగన్ సూటిగా ప్రశ్నించడంతో అధికారపక్షం డైలమాలో పడింది. ఈ దశలో ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డ సీఎం  చంద్రబాబు ‘ సీబీఐ విచారణకు ఆదేశించి.. రాజధాని రాకుండా చేయాలన్నదే మీ ఉద్దేశమా? ఎలాంటి విచారణా జరిపించేది లేదు. మీ చేతనైంది చేసుకోండి..’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.

  ఇరుకున పెట్టిన ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’
 ‘రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసుకుని ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’తో మోసం చేశారు. అసలు ఇది ఇన్‌సైడర్ ట్రేడింగ్ కంటే తీవ్రమైనది. మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కారుచౌకగా భూములు కొట్టేసి రైతులను వంచించారు. బాధ్యతల స్వీకారం నాటి ప్రమాణాలకు పాతరేశారు’ అంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడంతో అధికారపక్షం బిత్తరపోయింది. ఈ ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఏమిటా అని వారు చర్చించుకోవడం కనిపించింది. దీనికి ఏం సమాధానమివ్వాలా అని వారు బుర్రలు బద్దలు కొట్టుకున్నారు. ‘రాజధాని ఎక్కడ  వస్తుందో స్పష్టంగా తెలిసినప్పటికీ దాచిపెట్టి నూజివీడు... నాగార్జున విశ్వవిద్యాలయం...గురించి ప్రచారం చేసి, ఆయా ప్రాంతాల్లో  భూములు కొన్న వారు దారుణంగా నష్టపోయేలా ప్రభుత్వ పెద్దలు వ్యవహరించారు. వారు మాత్రం రాజధాని ప్రాంతంలోనే కొనుగోలు చేశారు. రాజధాని ప్రకటనకు ముందే ఆ ప్రాంతంలో మంత్రులు బినామీ పేర్లతో భూములు కొనడాన్ని బట్టే వారు మోసపూరితంగా కొనుగోలు చేసినట్లు స్పష్టమవుతోంది. ఇంతకంటే ఏమి ఆధారాలు కావాలి?’ అని జగన్ నిలదీశారు. దీంతో ఇంకా ఆయన్ను మాట్లాడనిస్తే అన్ని విషయాలు బయటపడతాయనే భయంతో ‘ముగింపు తీర్మానం’ పేరుతో ప్రతిపక్షం గొంతు నొక్కేశారు.

  ఆరోపణలకు దీటైన జవాబులు..
 అడుగడుగునా అడ్డుతగులుతూ చర్చకు సంబంధం లేకపోయినా తనపై దాఖలైన కేసుల గురించి, ఆస్తుల గురించి ప్రస్తావిస్తూ ఇరుకున పెట్టడానికి ప్రయత్నించిన అధికార పక్ష సభ్యులకు జగన్‌మోహన్‌రెడ్డి దీటైన జవాబిచ్చారు. 1978లో రాజకీయాల్లోకి వచ్చే నాటికి   రెండెకరాల భూమి మాత్రమే ఉన్న చంద్రబాబు నాయుడికి ఇప్పుడు రూ. 2లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. ‘‘నాపై సీబీఐ విచారణ జరిపించాలని కోర్టుకెళ్లిందెవరు?  వైఎస్ ఉన్నంతకాలం జగన్ మంచివాడే... కాంగ్రెస్‌లో ఉన్నంతవరకూ జగన్‌పై  కేసులు లేవు. కాంగ్రెస్‌లోనుంచి బయటకు రాగానే నాపై రాజకీయకక్షపూరితంగా కాంగ్రెస్, టీడీపీ కలిసి కేసులు వేశాయి. అయినా నేను విచారణ జరపవద్దంటూ బాబు లాగా స్టేల కోసం ప్రయత్నించలేదు.  యూపీఏ అధ్యక్షురాలు నేను సోనియాగాంధీపైనే పోరాటం కొనసాగించా’ అని జగన్ గుర్తు చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement