ఇంఫాల్‌లో రోడ్లపై నిర్మాణ సామగ్రికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు
ఇంఫాల్/కోల్‌కతా: కుకీ, మెయిటీ జాతుల మధ్య ముదిరిన వివాదం మణిపూర్‌లో హింసాకాండను ఆగనివ్వట్లేదు. తాజాగా శుక్రవారం మొదలైన ఘర్షణలు శనివారం సైతం ఎక్కువయ్యాయి. ఆందోళనకారుల దాడులు, సైన్యం, పోలీసుల భాష్పవాయు గోళాలు, రబ్బర్ బుల్లెట్ల ప్రయోగంతో పరిస్థితి ఉద్రిక్తంగా తయారైంది. ఇంఫాల్ పట్టణంలో శుక్రవారం రాత్రి మొదలైన ఘర్షణల్లో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. బీజేపీ నేతల ఇళ్లను తగలబెట్టేందుకు అల్లరిమూక ప్రయత్నించడం, దానిని భద్రతా బలగాలు అడ్డుకోవడంతో మొదలైన ఘర్షణల్లో ఈ ఇద్దరు గాయపడ్డారు. బిష్ణుపూర్ జిల్లాలోని క్వాక్తా పట్టణంలో, ఛురాచాంద్‌పూర్ జిల్లాలోని కాంగ్‌వాయ్‌లలో జరిగిన వేర్వేరు ఘటనల్లో తుపాకీ కాల్పులూ జరిగాయి.
పోలీస్‌స్టేషన్‌పై 400 మంది దాడి
ఇంపాల్ పశ్చిమ ప్రాంతంలోని ఇరింగ్‌బామ్ పోలీస్‌స్టేషన్‌లోని ఆయుధాగారంపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్లేందుకు అల్లరిమూక విఫలయత్నం చేసింది. శుక్రవారం అర్థరాత్రి వేళ దాదాపు
400 మంది ఆందోళనకారులు గుంపుగా దాడిచేసి ఆయుధాగారాన్ని కొల్లగొట్టే ప్రయత్నంచేయగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయి. ఆందోళన కారులు గుమికూడకుండా ఉండేందుకు హెచ్చరికగా సైన్యం, అస్సాం రైఫిల్స్ బలగాలు, మణిపూర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు సంయుక్తంగా ఇంఫాల్ పట్టణంలో అర్థరాత్రిదాకా కవాతు నిర్వహించాయి.
1,000 మంది మూకుమ్మడిగా..
ఇంఫాల్‌లోని ప్యాలెస్ కాంపౌండ్‌లో భవంతులకు నిప్పుపెట్టేందుకు దాదాపు 1,000 మంది ఆందోళనకారులు ప్రయత్నించారు. వారిని చెదరగొ ట్టేందుకు ఆర్‌ఏఎఫ్ బలగాలు భాష్పవాయు గోళాలు, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించాయి. మరో చోట ఎమ్మెల్యే బిశ్వజీత్ ఇంటిని తగలబెట్టేందుకు ఆందోళనకారులు ప్రయత్నించిగా ఆర్‌ఏఎఫ్ బలగాలు వారిని చెదరగొట్టాయి. సింజెమాయ్ ప్రాంతంలోని బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. వీరిని సైనికులు అడ్డుకున్నారు.
ఇంఫాల్‌లోని పోరంపేట్‌లో రాష్ట్ర బీజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలు శారదా దేవి ఇంటిని తగలబెట్టేందుకు యువత ప్రయత్నించగా భద్రతా బలగాలు చెదరగొట్టాయి. అంతకుముందు శుక్రవారం అంతా ఇంఫాల్ నడిబొడ్డున రహదారులను దిగ్బంధిస్తూ ఆస్తులను తగలబెడుతూ అల్లరిమూక హింసాకాండను కొన సాగించింది. గురువారం రాత్రి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి రంజన్ సింగ్ ఇంటిపై దాడి చేసి నిప్పుపెట్టిన విషయం విదితమే. ఆ సమయా నికి ఆయన ఇంట్లో లేరు. పదవీవిరమణ చేసిన దళి త ఐఏఎస్ అధికారికి చెందిన గిడ్డంగినీ ఆందోళన కారులు భస్మంచేశారు. వాంగ్‌ఖేయ్, పోరోమ్‌పట్, థంగపట్‌లలోనూ రోడ్లకు అడ్డంగా దుంగలు, టైర్లు కాల్చి రాకపోకలను స్తంభింపజేశారు.
నెలరోజుల్లో వందకుపైగా మరణాలు
నెలరోజుల క్రితం కుకీ, మెయిటీ జాతుల మధ్య మొదలైన వైరంలో 100 మందికిపైగా మరణించారు. తప్పుడు సమాచారం, వదంతుల వ్యాప్తిని నివారించేందుకు 11 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు. మెయిటీ వర్గానికి షెడ్యూల్ తెగ హోదా కట్టబెట్టాలన్న సిఫార్సుపై కుకీల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గిరిజనుల సంఘీభావ ర్యాలీ పేరిట కుకీలు మొదలుపెట్టిన యాత్ర హింసాత్మకంగా మారి నెలరోజులైనా మణిపూర్‌లో రావణకాష్టం ఆగట్లేదు. రాష్ట్ర జనాభాల్లో దాదాపు 53 శాతమున్న మెయిటీలు ఎక్కువగా ఇంఫాల్ లోయ ప్రాంతాల్లో నివసిస్తారు. గిరిజనులైన నాగాలు, కుకీల జనాభా రాష్ట్ర జనాభాలో దాదాపు 40 శాతం. వీరు ఎక్కువగా కొండ ప్రాంత జిల్లాల్లో ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment