కార్పొరేట్ విద్యకు కళ్లెం వేయాలి | assembly mla's speech about corporate education | Sakshi
Sakshi News home page

కార్పొరేట్ విద్యకు కళ్లెం వేయాలి

Published Thu, Mar 31 2016 2:47 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

assembly mla's speech about corporate education

విపక్ష సభ్యుల సూచన
ఫీజుల నియంత్రణకు చట్టాలు తేవాలి
ఉపాధ్యాయ యూనియన్లను తగ్గించాలని హితవు

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యావ్యవస్థను శాసిస్తున్న కార్పొరేట్ వ్యవస్థకు తక్షణం కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని విపక్ష సభ్యులు ప్రభుత్వానికి సూచించారు. కార్పొరేట్ల కబంధ హస్తాల్లో పూర్తిగా విద్యావ్యవస్థ చిక్కుకుపోయిందని, దాన్ని సాహసోపేతమైన నిర్ణయాలు, గట్టి చట్టాల ద్వారానే నియంత్రించవచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ యూనియన్లను తగ్గించాలని సూచించారు. బుధవారం విద్యావిధానంపై చర్చల్లో పలువురు సభ్యులు మాట్లాడారు.

 ఫీజుల నియంత్రణ చేపట్టాలి: కె.లక్ష్మణ్
‘ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్‌లో ఫీజులు వసూలు చేస్తున్నారు. విద్య పూర్తిగా కార్పొరేట్ల పద్మవ్యూహంలో చిక్కుకుంది. కఠిన చట్టాలు చేయకుంటే సామాన్యుడికి పూర్తిగా అందకుండా పోతుంది. కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకి కమిటీలను ఏర్పాటు చేసి, ఫీజుల నియంత్రణ చేయాలి’.

 కార్పొరేట్లను నియంత్రించాలి: ఆర్.కృష్ణయ్య
‘కార్పొరేట్లు విద్యను వ్యాపారంగా మార్చారు. వారిని నియంత్రించాలంటే కచ్చితంగా మాతృభాషలో విద్యాబోధన ఉండేలా చట్టాన్ని తేవాలి. ఒక యాజమాన్యం కింద ఒకే సంస్థ ఉండేలా, అడ్మిషన్లలో నియంత్రణ పెట్టేలా మార్పులు తేవాలి. ఫీజుల రేట్ల మీద సైతం కఠినంగా వ్యవహరించాలి. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమాన్ని తేవడంతోపాటు, మౌలిక వసతులను కల్పించాలి. ఆలస్యం చేయకుండా రెసిడెన్షియల్, ఎయిడెడ్, మోడల్, కస్తూర్భా పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి. రాష్ట్రంలో 40 ఉపాధ్యాయ యూనియన్లు ఉన్నాయి. వీటిలో ఉపాధ్యాయులంతా యూనియన్ల పేరుతో చదువు చెప్పడం మానేసి తిరుగుతున్నారు. అలా కాకుండా ఒకే యూనియన్ ఉండేలా, దానికి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేలా చూడాలి’.

  బొందపెట్టే పరిస్థితి తెచ్చుకోకండి: సంపత్
‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకముందు విద్యార్థులు చేయూతనిచ్చిన ఆందోళనలతో ఉస్మానియా యూని వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ సాక్షిగా టీఆర్‌ఎస్ పార్టీ ఎది గింది. అదే పార్టీ ఇపుడు అధికారంలోకి వచ్చి విద్యార్థులను, యూనివర్సిటీని పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలు క్షణాల్లో ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ అవుతుంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మెస్ బకాయిలు మాత్రం మూడునెలలైనా యూనివర్సిటీకి చేరలేదు. బకాయిల కారణంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, వారు పై చదువులకు, ఉద్యోగాలకు వెళ్లలేక పోతున్నారు. ఇదిలాగే కొనసాగితే.. అదే ఆర్ట్స్ కాలేజీ సాక్షిగా టీఆర్‌ఎస్ పార్టీని బొందపెట్టే పరిస్థితి వస్తుంది, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు’ అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలో అన్‌పార్లమెంటరీ పదం ఉన్నందున, దాన్ని రికార్డుల్లోంచి తొలగిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి ప్రకటించారు.

 పర్యవేక్షణ లేని స్కూళ్లు: మనోహర్‌రెడ్డి
పాఠశాలలపై పర్యవేక్షణ లేకుండా పోయిందని, ఎంఈవోలు, డిప్యూటీ ఈవోలు లేకుండాపోయారు. వారి నియామకాలకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. పాఠశాలలను రేషనలైజేషన్ చేయాలి.. విద్యార్థులు ఉపాధి అవకాశాలు లభించేలా 8వ తరగతి నుంచే వృత్తి, సాంకేతిక విద్యా కోర్సులను ప్రవేశ పెట్టాలి. యూనియన్లు ఎక్కువగా ఉన్నాయి. ఇన్ని అవసరమా.. అందరూ ఆలోచించాలి’.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement