
‘అసెంబ్లీ’ 4 వారాలైనా నిర్వహించాలి : ఉమ్మారెడ్డి
వైఎస్సార్‌సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఏపీ శాసనసభ సమావేశాలను తూతూమంత్రంగా నిర్వహించొద్దని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి కనీసం 3 నుంచి 4 వారాలైనా కొనసాగించాలని శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కోరారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జీఎస్టీ బిల్లును ఆమోదించడానికే సెప్టెంబర్‌లో 3 రోజులో, వారం రోజులో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదన్నారు.
వర్షాభావంతో రైతులు అల్లాడుతున్నారని, సమాజంలో అన్ని వర్గాలు ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని, ఇలాంటి సమయంలో మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాల నిర్వహించాలనుకోవడం తగదన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తుందా? ఇవ్వదా?, రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందా? లేదా? అనే అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాలని చెప్పారు. రాజధాని నిర్మాణంలో స్విస్ చాలెంజ్ విధానం, బలహీనవర్గాలకు చెందిన 550 హాస్టళ్ల మూసివేత, విశాఖపట్నం రైల్వే జోన్ తదితర కీలక అంశాలపై అసెంబ్లీలో చర్చించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
పుష్కర పనుల సొమ్ము దోపిడీ
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నత్తనడకన సాగుతోందని, దీనిపై అసెంబ్లీలో చర్చించి మన ఆందోళనను కేంద్రానికి తెలియజేయాలని ఉమ్మారెడ్డి సూచించారు. కృష్ణా పుష్కరాల పేరుతో రూ.1,800 కోట్ల విలువైన పనులను నామినేషన్‌పై టీడీపీ తన తాబేదార్లకు కట్టబెట్టిందని, ఈ సొమ్ములో ఎక్కువ భాగం దోపిడీకి గురైందని ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసులో నిందితుడైన జెరూసలేం మత్తయ్య చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి శాసనసభలో వివరణ ఇవ్వాలన్నారు. అత్యంత కీలకమైన గోదావరి, కృష్ణా జలాల పంపిణీపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం మహారాష్ర్టతో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఆ ప్రభావం ఏపీపై ఏ మేరకు ఉంటుందో చర్చించాలన్నారు.