పోలవరం నిర్వాసితులకు అన్యాయం: వైస్ జగన్
పోలవరంలో ప్రతిరోజూ ధర్నాలు జరుగుతున్నాయని, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్అండ్ఆర్ ప్యాకేజి అక్కడ ఇవ్వడం లేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో 12వ రోజు ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా ఆయన ఈ అంశంపై మాట్లాడారు. మంత్రులు, ఉన్నతాధికారులు స్వయంగా వెళ్లి అక్కడ ఏం జరుగుతోందో చూడాలని, కావాలంటే తాను కూడా వస్తానని ఆయన చెప్పారు. పదేళ్ల నుంచి భూసేకరణ జరుగుతున్నా ఇప్పటికీ అది ఓ కొలిక్కి రాక గిరిజనులు కష్టపడుతున్నారని, నిర్వాసితులకు న్యాయం చేసి ప్రాజెక్టు కట్టడం న్యాయమని తెలిపారు. ఇలా అంటున్నాము కదా అని తాము పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకం అనే ముద్ర వేయొద్దని, తామెవ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. నిర్వాసితులను విశ్వాసంలోకి తీసుకోవాలని, వాళ్లకు పరిహారం ఇచ్చి ప్రాజెక్టు కడితే అందరి ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. పోలవరం గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాలు జరగడం లేదని అన్నారు.
రామయ్యపేట, పైడిపాక, చేగొండపల్లి గ్రామాలను ఖాళీ చేయాలని రెండు నెలలుగా ఒత్తిడి తెస్తున్నారు. పట్టిసీమలో ఎకరాకు 25 లక్షల చొప్పున ఇచ్చారని గుర్తు చేశారు. భూసేకరణకు అయ్యే ఖర్చు ఎప్పుడూ ప్రాజెక్టు వ్యయంలో 5 శాతం కన్నా తక్కువే ఉంటుందని, అలాంటప్పుడు పేదప్రజలను సంతృప్తిపరుద్దామని వైఎస్ జగన్ అన్నారు. ప్యాకేజి తీసుకోనప్పుడు ఇవ్వడంలో తప్పేముందని, అప్పుడు తీసుకోలేదు కాబట్టి కొత్త చట్టాన్ని అనుసరించి తమకు పరిహారం ఇవ్వాలని వాళ్లు కోరుతున్నారని తెలిపారు. అప్పుడు డబ్బులు తీసుకుంటే ఇప్పుడు అడగడం తప్పే గానీ అలా తీసుకోలేదు కాబట్టి వాళ్లకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, చేగొండపల్లి గ్రామాన్ని శుక్రవారమే ఖాళీ చేయించినట్లు మంత్రి ఉమా మహేశ్వరరావు చెప్పారు. పైడిపాక, రామయ్యపేట గ్రామస్తులకు నచ్చజెబుతున్నామని అన్నారు. నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని, ఆర్అండ్ఆర్, భూసేకరణ విషయాల్లో వాళ్లకు అనుకూలంగానే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.