
అటెండర్, డ్రైవర్లే కంపెనీ డైరెక్టర్లుగా..
⇒ బోగస్ కంపెనీలతో షేర్లు మళ్లించిన స్టాక్ మర్చంట్ బ్రోకర్
⇒ రవి డిస్టిలరీస్ యజమానికి రూ.70 కోట్ల మేర టోపీ
⇒ పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు..రాష్ట్ర సీఐడీకి అప్పగించిన సుప్రీంకోర్టు
⇒ 62 మంది నిందితుల గుర్తింపు.. ఏడుగురు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ‘మీ కంపెనీ షేర్లను పబ్లిక్ ఇష్యూలోకి తీసుకురండి.. షేర్ మార్కెట్లో పెట్టి బ్యాంకుల్లో అప్పులు తీసుకోకుండా లాభాలు గడించండి..’అంటూ అనిల్ అగర్వాల్ అనే స్టాక్ మర్చంట్ బ్రోకర్ ఓ ప్రముఖ డిస్టిలరీస్ కంపెనీకి రూ.70 కోట్లు టోపీ పెట్టాడు. తన ఆఫీసులో పనిచేసే అటెండర్లు, అసిస్టెంట్లు, డ్రైవర్లను డైరెక్టర్లుగా పెట్టి 15 నుంచి 20 సూట్‌కేసు కంపెనీలు ఏర్పాటు చేశాడు. డిస్టిలరీస్ కంపెనీ షేర్ల డబ్బును ఆ కంపెనీల్లోకి మళ్లించేసి, దండుకున్నాడు. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదుకావడంతో.. సుప్రీంకోర్టు దర్యాప్తు బాధ్యతను తెలంగాణ సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించిన అధికారులు 62 మందిని నిందితులుగా చేర్చి.. ఏడుగురిని అరెస్టు చేశారు.
ఏం జరిగింది?
పుదుచ్చేరికి చెందిన రవికుమార్ 2010లో హైదరాబాద్‌లోని నాచారంలో రవికుమార్ డిస్టిలరీస్ లిమిటెడ్ పేరిట డిస్టిలరీ (లిక్కర్ తయారీ) కంపెనీని ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా తన బిజినెస్‌ను విస్తరించారు. అయి తే కొంతకాలం కింద రవికుమార్‌కు ముంబైకి చెందిన అనిల్ అగర్వాల్ అనే స్టాక్ మర్చంట్ బ్రోకర్ (స్టాక్ మార్కెట్లో ఆయా కంపెనీల షేర్ల ను నిర్వహించేవారు) పరిచయమయ్యాడు. వ్యాపారానికి డబ్బులు కావాలంటే బ్యాంకు రుణం తీసుకోవాల్సిన అవసరం లేదని.. కంపె నీ షేర్లను పబ్లిక్ ఇష్యూకు వెళ్లి విక్రయించ వచ్చని సలహా ఇచ్చాడు. స్టాక్ మార్కెట్ కార్యకలాపాలన్నీ తాను చూసుకుంటానని చెప్పాడు.
రవికుమార్‌కు స్టాక్ మార్కెట్ వ్యవహారాలపై పెద్దగా అవగాహన లేకున్నా.. అనిల్‌ను నమ్మి కంపెనీ షేర్లను పబ్లిక్ ఇష్యూలో పెట్టాడు. మార్కెట్ బాగుండటంతో షేర్లు మంచి ధరకు విక్రయమయ్యాయి. దీన్ని అదునుగా చేసుకున్న అనిల్.. ప్రతిసారీ వచ్చి కలవడం కుదరడం లేదంటూ కంపెనీ ఖాళీ లెటర్ హెడ్స్‌పై రవికుమార్ నుంచి సంతకాలు తీసుకున్నాడు. వాటిని ఉపయోగించుకుని కంపెనీ షేర్లను అమ్ముకున్నాడు.
20 సూట్‌కేసు కంపెనీలు..
రవికుమార్ డిస్టిలరీస్ కంపెనీ స్టాక్ మార్కెట్‌లో నమోదైన మరుసటి ఏడాది నుంచే అనిల్ తన ప్రతాపం చూపించాడు. యాజమాన్యానికి తెలియకుండా ఏడాదిన్నరపాటు మెల్లమెల్లగా రూ.70 కోట్ల విలువైన షేర్లను అమ్ముకున్నాడు. ఆ డబ్బులను దారి మళ్లించి, వైట్ చేసుకునేందుకు అనిల్ తన బంధువులు, తన ఆఫీసులో పనిచేసే అటెండర్లు, డ్రైవర్లతో 20 సూట్‌కేసు కంపెనీలు సృష్టించాడు. ఇలా చెన్నైలోని రాధా సోమి సెక్యూరిటీ ప్రైవేట్ లిమిటెడ్, ముంబైలోని బీఎల్‌సీ ట్రేడింగ్ కంపెనీ, ఫ్యాక్ట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ తదితర కంపెనీల్లో షేర్లు కొన్నట్టు లెక్కపత్రాలు సృష్టించి, సొమ్ము కాజేశాడు. ఈ షేర్లు కొన్న డబ్బులు సంబంధిత కంపెనీల ఖాతాల్లోకి జమ అయి నెల తిరిగేలోపే మళ్లీ అనిల్ వద్దకు చేరినట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది.
కేసులన్నీ రాష్ట్ర సీఐడీకి..
అనిల్ అగర్వాల్ మోసాలపై కంపెనీ ఎండీ రవికుమార్ 2011లో నాచారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతోపాటు ముంబైలో, కంపెనీ హెడ్‌క్వార్టర్స్‌గా ఉన్న పుదుచ్చేరి, చెన్నైల్లోనూ కేసులు నమోదయ్యాయి. దీంతో సుప్రీంకోర్టు అన్ని కేసులను రాష్ట్ర సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ 62 మంది నిందితులను గుర్తించింది. ఈకేసులో ప్రధాన నిందితుడైన అనిల్ అగర్వాల్ కోర్టు నుంచి నాట్ టు అరెస్ట్ ఉత్తర్వులు తెచ్చుకోవడంతో నోటీసులిచ్చి విచారిస్తున్నట్టు తెలిసింది. చెన్నైకి చెందిన భగవతీ ప్రసాద్ జన్‌జన్‌వాలా, భాస్కరన్ సత్యప్రకాశ్, ముంబైకి ముఖేష్ పృథ్వీరామ్ చౌహాన్, ప్రపుల్ సదానంద రాణే, కోల్‌కతాకు చెందిన సర్వేశ్వర్ పరీదా, పుష్పల్‌చంద్ర, రాజేంద్రకుమార్ రీటాలను అధికారులు అరెస్టు చేశారు.