వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు అథారిటీ
దక్షిణ కొరియా పర్యటనలో మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర పురపాలక మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. కాలుష్యకారక పరిశ్రమలను హైదరాబాద్ నుంచి బయటకు పంపుతున్నామన్నారు. దక్షిణ కొరియాలో రెండో రోజు పర్యటనలో భాగంగా శుక్రవారం హనమ్ నగరాన్ని ఆయన సందర్శించారు. అక్కడ వాయు కాలుష్యం తగ్గించేందుకు అమలు చేస్తున్న కార్యక్రమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఘన వ్యర్థాల నిర్వహణ కోసం అక్కడి యూనియన్ టవర్స్‌లో అమలు చేస్తున్న పద్ధతులను పరిశీలించారు. అంతకు ముందు సియోల్‌లోని చియోన్‌గిచియోన్ నది ప్రక్షాళన ప్రాజెక్టును సందర్శించారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్ల పనితీరునూ పరిశీలించారు. చియోన్‌గిచియోన్ నది ప్రక్షాళనను విజయవంతంగా అమలు చేసిన అధికారుల నిబద్ధతను మంత్రి ప్రశంసించారు. మూసీ నది ప్రక్షాళనకు ఇలాంటి అంతర్జాతీయ అనుభవాలను ఉపయోగించుకుంటామని తెలిపారు. ప్రజల భాగస్వామ్యం ఉంటే ఇలాంటి కార్యక్రమాలు సాధ్యం అవుతాయన్నారు. మూసీ ప్రక్షాళన చేస్తామని, ఇందుకోసం దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేస్తామన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం బాపూ ఘాట్ వద్ద సుందరీకరణ పనులు చేపట్టామన్నారు.