ఆడుకుంటూ బాల్కనీ నుంచి పడిపోయింది!
హైదరాబాద్: అభం శుభం తెలియని ఓ పాప ఆడుకుంటూ అపార్ట్‌మెంట్ నుంచి కింద పడిపోయింది. నగరంలోని పాతబస్తీ బహదూర్ పురలో ఆదివారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆ వివరాలు.. పాతబస్తీలోని బహదూర్ పుర ఎంవో కాలనీలో 18 నెలల చిన్నారి ఫాతిమా అపార్ట్‌మెంట్ ఫస్ట్ ఫ్లోర్‌లోని తమ ఫ్లాట్‌లో ఆడుకుంటుంది. అలా ఆడుకుంటూ ఫాతిమా అలాగే బాల్కనీలోకి వచ్చేసింది. ఆ చిన్నారి పొరపాటున ఆ ఫ్లోర్ నుంచి ఒక్కసారిగా కింద పడిపోయింది.
ఇది చూసిన పక్కింటి వ్యక్తి వెంటనే వచ్చి పాపను ఎత్తుకుని ఏమైందోనని చూశాడు. ఆ వెంటనే స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబసభ్యులు ఆ పాపను హుటాహుటీనా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లక్డీకపూల్ లోని లోటస్ ఆస్పత్రిలో చిన్నారికి చికిత్స అందిస్తున్నట్లు సమచారం. ఫాతిమా ఆడుకుంటుండగా పొరపాటున ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోయిందని, దీంతో తలకు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు చెప్పారు. ఫాతిమాకు ఏమైతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.