
నాన్న హమాలీ.. కూతురు లెక్చరర్
జేఎల్ పరీక్షల్లో రాష్ట్రంలో మొదటిర్యాంకు సాధించిన ఫాతిమా
అభినందించిన గ్రామస్తులు
సదాశివపేటరూరల్ (సంగారెడ్డి): మండలంలోని ఇశ్రితాబాద్ గ్రామానికి చెందిన బాబుమియా సివిల్ సప్లై గోదాంలో హమాలీ పని చేస్తూ కూతుర్ని ఉన్నత చదువులు చదివించాడు. బాబుమియా కూతురు తస్లీమ్ ఫాతిమా చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండేది. ఆమె చదువు పట్ల చూపుతున్న ఆసక్తిని గమనించిన తండ్రి బాబుమియా హమాలీ పని చేస్తూ కూతురిని ఎంఎస్సీ జువాలజీ (ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్) వరకు చదివించాడు.
కాగా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన జూనియర్ లెక్చరర్ పరీక్షలో తన ప్రతిభను చాటి రాష్ట్రంలోనే మొదటి ర్యాంకును సాధించింది. దీంతో ఈ నెల 12న బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్(జువాలజీ)గా ఎంపికై హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కొలువుల పండుగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా నియామక పత్రాన్ని అందుకుంది.
సదాశివపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జువాలజీ లెక్చరర్‌గా ఫాతిమా గురువారం ఉద్యోగంలో చేరారు. తండ్రి పడ్డ కష్టానికి కూతురు తగిన ఫలితం సాధించడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. గ్రామస్తులు, మాజీ సర్పంచ్ రాములు, నాయకులు శ్రీనివాస్, బంధువులు,స్నేహితులు ఆమెను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment