బహుమెత్తని బహుమతి | Bahumettani gift | Sakshi
Sakshi News home page

బహుమెత్తని బహుమతి

Published Tue, Feb 10 2015 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM

బహుమెత్తని బహుమతి

బహుమెత్తని బహుమతి

మన ఇష్టాన్ని అవతలివారికి తెలియజేయడానికి పడే కష్టాన్ని తగ్గించేది.. అవతలివారి ఇష్టాన్ని చూరగొనడానికి చేసే ప్రయత్నం ఫలించేలా చేసేది ఒకటుంది. అదేంటో తెలుసా..? కానుక. అవును. ఓ మంచి కానుక మనం చెప్పకుండానే మన మనసును అవతలివారి ముందు పరుస్తుంది. వారి మనసులో మనమీద ఓ ముద్ర వేస్తుంది. తగిన స్థానాన్నీ కల్పిస్తుంది. అందుకే మన అనుకునేవారికి, మనవాళ్లని చేసుకునేందుకు మనం ఎంచుకున్న వారికి.. మంచి కానుకను ఇవ్వడానికి ఓ రోజును సృష్టించారు. అదే ‘టెడ్డీ డే’!        

..:: సమీర నేలపూడి
 
వాలెంటైన్  వీక్‌లో నాలుగో రోజైన ‘టెడ్డీ డే’ నాడు ప్రతి ప్రేమికుడూ తన ప్రేయసికి ఓ టెడ్డీ బేర్‌ను గిఫ్ట్‌గా ఇస్తాడు. టెడ్డీ బేర్‌నే ఎందుకు ఇస్తారు అన్నది తెలుసుకోవాలంటే.. ముందు ఆ బొమ్మ చరిత్రను తెలుసుకోవాలి. నిజానికి టెడ్డీ బేర్ అనే బొమ్మ పుట్టుక వెనుక పెద్ద కథే ఉంది. 1902లో నాటి అమెరికా అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్.. మిసిసిపీ, లూసియానాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యని తీర్చడానికి వెళ్లారు. తీరిక సమయంలో మిసిసిపీలో వేటకు వెళ్లారు. అప్పుడాయనకు ఓ ఎలుగుబంటి కంటబడింది. వెంటనే దాన్ని వేటాడాలనుకున్నారు రూజ్‌వెల్ట్. కానీ అది బుజ్జి పిల్ల. ఎంతో ముద్దుగా ఉంది. దాంతో కాల్చడానికి ఆయనకు మనసొప్పలేదు. జాలితో విడిచిపెట్టేశారు. మర్నాడు ఓ పత్రికలో క్లిఫార్డ్ బెర్రీమ్యాన్ అనే కార్టూనిస్టు వేసిన చక్కని కార్టూన్ ప్రచురితమైంది. దాన్ని చూసిన ఓ బొమ్మల కంపెనీ యజమానురాలు, ఎలుగుబంటి పిల్ల రూపంలో ఓ బొమ్మను తయారుచేసింది. దాన్ని రూజ్‌వెల్ట్‌కు పంపిస్తూ... ‘ఆ బొమ్మకి టెడ్డీ బేర్’ అని పేరు పెట్టుకోవచ్చా’ అంటూ లేఖ రాసింది. ఆయన అనుమతినివ్వడంతో టెడ్డీ బేర్ అనే బొమ్మ ఈ ప్రపంచానికి పరిచయమైంది.
 
సాఫ్ట్ గిఫ్ట్..

ఆనాడు అలా రూజ్‌వెల్ట్ ఎలుగు పిల్లను సంరక్షించడం వల్లే టెడ్డీ బేర్ పుట్టుకొచ్చింది కాబట్టి, టెడ్డీ బేర్‌ను సంరక్షణకు ప్రతిరూపంగా భావిస్తున్నారు. అందుకే వాలెంటైన్ వీక్‌లో ‘టెడ్డీ డే’నాడు.. నిన్ను జీవితాంతం జాగ్రత్తగా కాపాడుకుంటాను అని వాగ్దానం చేస్తూ ప్రేమికులు తమ ప్రియసఖులకు టెడ్డీ బేర్‌ను బహుమతిగా ఇవ్వడం జరుగుతోంది. ఈ మధ్య కొందరు అమ్మాయిలు కూడా అబ్బాయిలకు టెడ్డీ బేర్ కీ చెయిన్లు, టెడ్డీ బొమ్మలు ముద్రించిన గ్రీటింగ్ కార్డులూ ఇస్తున్నా.. ఎక్కువగా ఇచ్చేది మాత్రం అబ్బాయిలే. అబ్బాయిలే అమ్మాయిలకు ఎందుకు ఇస్తారు అనే ప్రశ్నకు రెండు సమాధానాలు ఉన్నాయి. మొదటిది.. అమ్మాయిలే సాఫ్ట్ టాయిస్‌ని ఇష్టపడతారు. రెండవది.. ఎప్పుడూ పురుషుడే స్త్రీని సంరక్షించాల్సిన స్థానంలో ఉంటాడు. అందుకే టెడ్డీ డే రాగానే ప్రతి ప్రేమికుడూ తన ఇష్టాన్ని, ప్రేమను వ్యక్తపరుస్తూ.. ఆమెను కాపాడతానని భరోసా ఇస్తూ.. అందమైన టెడ్డీ బేర్‌ని ప్రేయసి చేతుల్లో పెడతాడు. ఆమె మనసును, నమ్మకాన్ని గెలుచుకుంటాడు!
 
అద్దాల అల్మరాల్లోంచి..

భాగ్యనగరంలో టెడ్డీ డే సందడి చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. సంవత్సరమంతా దుకాణాల్లోని అద్దాల అల్మరాల్లో కూర్చుని జాలిగా చూసే టెడ్డీ బేర్లు.. టెడ్డీ డే దగ్గర పడుతోందంటే రోడ్ల మీదకు వచ్చి సందడి చేస్తుంటాయి. ఎరుపు, తెలుపు, గులాబి, ఆరెంజ్ తదితర రంగుల్లో మెరిసిపోతుంటాయి. అయితే ప్రేమికుల మనసుకు దగ్గరగా ఉండే గులాబి రంగు టెడ్డీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. మెడకు అందమైన రిబ్బన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. టెడ్డీ మెత్తని రూపం.. చెలి నులివెచ్చని కౌగిలిలో నలిగిపోతుంది. వాలెంటైన్స్ డే పూర్తయ్యే వరకూ రోడ్ల పక్క ఎక్కడ చూసినా టెడ్డీలు కనిపించి మురిపిస్తుంటాయి. ఈ ఏడాది కూడా వీటి సందడి ఎక్కువగానే ఉంది. ఎక్కడ చూసినా ప్రేమికులు టెడ్డీలను కొంటూ కనిపిస్తున్నారు. తమ ప్రేమ కానుకను ప్రేమించిన వారికి అందించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement