కాంగ్రెస్‌ది దిగజారుడు రాజకీయం
మీరాకుమార్‌ను బలిపశువును చేస్తున్నారు: బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికపై టీఆర్‌ఎస్ వైఖరిని కాంగ్రెస్ తప్పుపట్టడాన్ని ఖండిస్తున్నామని, రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ఎందుకిస్తున్నామో పార్టీ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించిందని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. కోవింద్ దళితుడు మాత్రమే కాకుండా న్యాయ కోవిదుడని, సీఎం కేసీఆర్ సూచనతోనే రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత అభ్యర్థిని మోదీ ఎంపిక చేశారని అన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో గురువారంబాల్క సుమన్ విలేకరులతో మాట్లాడారు.
ప్రధాని మోదీ ఫోన్ చేసిన తర్వాత సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ నేతల అభిప్రాయం తీసుకుని ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. దళితుల మీద కాంగ్రెస్‌కు ప్రేమ ఉంటే ఎన్డీయే కంటే ముందే ఎందుకు దళిత అభ్యర్థిని ప్రకటించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ దిగజారుడు రాజకీయం చేస్తోందని ఆరోపించారు. మీరాకుమార్ అంటే తమకూ ప్రత్యేక అభిమానం ఉందని, కాంగ్రెస్ ఆమెను బలి పశువును చేస్తోందన్నారు.
సీబీఐ కేసులకు భయపడే టీఆర్‌ఎస్ ఎన్డీయే అభ్యర్ధికి మద్దతు ఇచ్చిందనడం బట్టకాల్చి మీద వెయ్యడమేనని, సీబీఐ కేసుల చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అని వ్యాఖ్యానించారు. ఎన్డీయేలోలేని బీజేడీ, జేడీయూ, అన్నాడీఎంకే వంటి పార్టీలు కూడా టీఆర్‌ఎస్ తరహాలోనే కోవింద్‌కు మద్దతు ఇస్తున్న విషయం కాంగ్రెస్‌కు తెలియదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సంపత్ అవగాహన లేమితో క్రాస్ ఓటింగ్ గురించి మాట్లాడుతున్నారని, టీఆర్‌ఎస్ ఓట్లన్నీ కోవింద్‌కే పడతాయన్నారు. జేఏసీ చైర్మన్ కోదండరాం కోదండరాంగ్‌గా మారారని, తప్పుడు ప్రయోజనాలతో ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారని ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు.