
సవాలు స్వీకరించే సత్తా లేకే విమర్శలు
విపక్షాలపై ఎంపీ బాల్క సుమన్ మండిపాటు
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగురకపోతే పదవికి రాజీనామా చేస్తానంటూ మంత్రి కేటీఆర్ చేసిన సవాలును.. దమ్ముంటే విపక్షాలు స్వీకరించాలని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, దివాకర్‌రావుతో కలిసి మంగళవారం టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో బాల్క సుమన్ విలేకరులతో మాట్లాడారు.
కేటీఆర్ విసిరిన సవాలుకు నేరుగా స్పందించకుండా.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరు దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నిజంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి వుంటే కేటీఆర్ సవాలును ఎందుకు స్వీకరించడం లేదని ప్రశ్నించారు.
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సుమారు వంద సీట్లు గెలుస్తుందని అన్ని సర్వేలు సూచిస్తున్నాయని.. తమ పార్టీ మేయర్ పీఠం దక్కించుకుంటుందని సుమన్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటమి ఖాయమని తేలడంతో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ముఖం చాటేస్తున్నాయంటూ ఆ పార్టీలపై బాల్క సుమన్ నిప్పులు చెరిగారు.
పెద్దవారిని దూషిస్తే పెద్ద నాయకుడిని అవుతాననే భ్రమలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ పాత్రను గుర్తు చేస్తూ... కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వస్తున్నాయంటూ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. టీఆర్‌ఎస్‌ది రాజకీయ ఉగ్రవాదం అంటూ పీసీసీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై సుమన్ మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రాక్షస చరిత్ర వుందని, చంపే.. చంపించే సంస్కృతి ఆ పార్టీ సొంతం అంటూ వ్యాఖ్యానించారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండంగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బల్దియా ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం వుంటే కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ మంత్రి కేటీఆర్ సవాలును స్వీకరించాలన్నారు.
ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం : కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు టీడీపీ కార్య నిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో రేవంత్ పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడితే ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని కృష్ణారావు హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.