త్వరలో ‘బినామీ’ చట్టం
కేంద్ర మంత్రి దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు ద్వారా వచ్చే ప్రయోజనాలకు మరికొంత సమయం పడుతుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రయోజనం కోసమే ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. సోమవారం బర్కత్‌పురాలోని కార్మిక భవిష్యనిధి కార్యాలయంలో దత్తాత్రేయ మాట్లాడారు. నోట్ల రద్దుతో కొంత గందరగోళం నెలకొందని, ప్రస్తుతం ఆ పరిస్థితులు సద్దుమణుగుతున్నాయన్నారు. ‘ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ముందు మరో అస్త్రం ఉంది. అదే బినామీ లావాదేవీల చట్టం (బినామీ ట్రాన్సెక్షన్ యాక్ట్). త్వరలో దీన్ని పూర్తిస్థాయిలో ప్రయోగిస్తాం. నోట్ల రద్దుతో తీవ్రవాద కార్యకలాపాలు బాగా తగ్గాయి. గత నెలలో కశ్మీర్‌లో ఒక్కసారి మాత్రమే బాంబు దాడి జరిగింది. కాంగ్రెస్, వామపక్షాలు మాత్రం నల్లధనికుల ను ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల జరగనున్న ఐదు రాష్ట్రాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలే అధికారంలోకి వస్తాయి’అని దత్తాత్రేయ చెప్పారు.
ఈపీఎఫ్ ఖాతాలూ ఆధార్‌కు అనుసంధానం
ప్రతి బ్యాంకు ఖాతాలను ప్రస్తుతం ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నామని మంత్రి తెలిపారు. అదే విధంగా త్వరలో ఈపీఎఫ్ ఖాతాలను సైతం ఆధార్‌తో అనుసంధానిస్తామన్నారు. దేశంలో 4.30 కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో ఇప్పటివరకు 2 కోట్లకు పైగా ఖాతాదారులు ఆధార్ సమర్పిం చారన్నారు. ప్రతి కార్మికుడికి వేతనాన్ని బ్యాంకు ఖాతాలో వేయాలనే చట్టాన్ని తీసు కొస్తామని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నగర రోడ్లు అధ్వానం...
హైదరాబాద్ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వీటిని బాగుచేయాలని ప్రభుత్వానికి సూచించా. ‘ఎన్నికలకు ముందు నగర రోడ్లను పరుపు మాదిరిగా చేస్తామని టీఆర్‌ఎస్ నేతలు చెప్పారు. ఆ మాట నిలబెట్టుకోవాలి’ అన్నారు. నగదు రహిత లావాదేవీలపై అవగాహనకు రూపొందించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు.