సాక్షి, హైదరాబాద్: వినియోగదారులకు చెక్కులు కావాలంటే బ్యాంకులో కొన్నింటిని ఉచితంగా ఇస్తారు. అదనంగా కావాలంటే కొంత డబ్బు చెల్లిస్తే ఇస్తారు. అంతేగానీ వాటిని మనమే ముద్రించుకోలేం కదా. రాష్ట్ర ప్రభుత్వానికి సరిగ్గా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. రైతు పెట్టుబడి పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒకేసారి 70 లక్షల చెక్కులు అవసరమయ్యాయి. అయితే ఒకేసారి అన్ని చెక్కులు సమకూర్చడం తమవల్ల కాదని చేతులెత్తేసిన బ్యాంకులు.. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని ఇండెంట్ పెట్టి తెప్పించుకోవాలని స్పష్టం చేస్తున్నాయి. దీంతో చెక్కులు కావాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. కేంద్రం అనుమతిస్తే చెక్కులను ప్రత్యేకంగా ముద్రిస్తారు. అలా ముద్రించి ఇచ్చిన చెక్కులను రాష్ట్రంలో బ్యాంకులకు వ్యవసాయ శాఖ అందజేస్తుంది. ఆ తర్వాత వాటిపై రైతుల వివరాలను, పెట్టుబడి సాయం సొమ్ము నమోదు చేసి రైతులకు అందజేస్తారు.
చెక్కులకు డబ్బు చెల్లించాల్సిందే..
రాష్ట్రంలో రైతు పెట్టుబడి పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం చెక్కులను ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఖరీఫ్ నుంచి అమలు చేసే ఈ పథకం కింద రైతులకు చెక్కులు ఇస్తారు. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో రైతు ఖాతాలు 71.75 లక్షలున్నాయి. ఆ ప్రకారం రైతుల సంఖ్య అటుఇటుగా 70 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. అందువల్ల అంతమంది రైతులకు చెక్కులు ఇవ్వాలంటే మాటలు కాదు. ఈ నేపథ్యంలో చెక్కులను ముద్రించి ఇచ్చేందుకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని అంటున్నారు. వినియోగదారులకు 30 చెక్కులు ఉచితంగా ఇస్తారు. అంతకంటే ఎక్కువ కావాలంటే ఒక్కో చెక్కుకు రూ.2.50 నుంచి రూ.5 వరకు వసూలు చేస్తారు. ఆ ప్రకారం 70 లక్షల చెక్కులకు రూ.2 కోట్లకు పైనే ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
అలాగే చెక్కులు ముద్రించే ప్రదేశం నుంచి తెప్పించుకునేందుకు రవాణా చార్జీలు అదనంగా ఉంటాయని అంటున్నారు. రబీ సీజన్‌కు కూడా అప్పటి అవసరాన్ని బట్టి మళ్లీ చెక్కులను ముద్రించుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి 70 లక్షల ముద్రణ సాధ్యమయ్యే పనికాదు. వినియోగదారులు తమకు చెక్కులు కావాలంటే బ్యాంకులు ఇండెంట్ పెట్టి సమయం ఇస్తాయి. ఈ మేరకు ఇన్ని లక్షల చెక్కుల ముద్రణకు కనీసం రెండు నెలల సమయం తీసుకుంటుందని చెబుతున్నారు. అంటే ప్రభుత్వం కేంద్రం నుంచి అనుమతి తీసుకొని ముద్రణకు ఆర్డర్ ఇస్తే మార్చి వరకు సమయం పడుతుంది. కాబట్టి చెక్కుల ప్రక్రియను వేగవంతం చేయాలని భావిస్తున్నారు.
‘పెట్టుబడి’కి చెక్కుల చిక్కులు!
Published Wed, Jan 24 2018 12:54 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment