
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకం కింద అన్నదాతలకు అందజేసే పెట్టుబడి చెక్కులపై సదరు రైతు సామాజికవర్గం, కులం రెండింటినీ ముద్రించాలని వ్యవసాయ శాఖ యోచిస్తుంది. లబ్ధిదారులను సులువుగా గుర్తించేందుకు ఈ ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. ఉదాహరణకు బీసీ వర్గానికి చెందిన రైతు అయితే బీసీ వర్గం, అతని కులాన్ని చెక్కుపై ముద్రిస్తారు. ఓసీ వర్గానికి చెందిన రైతయితే, ఓసీ అని రాసి అతని కులాన్ని ముద్రిస్తారు. ప్రస్తుతం చెక్కులపై రైతు బంధు పథకం, రైతు పేరు, పట్టాదారు పాసు పుస్తకం నంబర్, రెవెన్యూ గ్రామం తదితర వివరాలుంటాయి. చెక్కులపైనే కులాన్ని కూడా జోడించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. సాధ్యాసాధ్యాలపై అధికారులు బ్యాంకర్లతో చర్చిస్తున్నారు. ఈ నెల 19న ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశాలున్నాయి. అత్యంత వెనుకబడిన గ్రామం నుంచి చెక్కుల పంపిణీ ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
3,302 గ్రామాల్లో తొలి పంపిణీ..
తొలి విడతగా 16.36 లక్షల మంది రైతుల సమాచారాన్ని ఆర్థిక శాఖ ద్వారా బ్యాంకులకు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా 522 మండలాల్లో 3,302 గ్రామాలకు సంబంధించి సమగ్ర సమాచారమున్న డేటాను తొలివిడతగా అందజేశారు. ప్రాంతాల వారీగా ఎనిమిది బ్యాంకులకు సంబంధిత చెక్కుల ముద్రణ బాధ్యతలను అప్పగించారు. పెట్టుబడి చెక్కులను పంపిణీ చేసేందుకు మరో రెండు వారాలే గడువు మిగిలి ఉండటంతో ప్రభుత్వం హడావుడి పడుతోంది. ఇప్పటికీ చెక్కుల ముద్రణ ప్రారంభం కాలేదు. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం వ్యవసాయ శాఖను ఆరా తీసింది. సమయం చాలా తక్కువుందని, ఆలస్యం చేయవద్దని సీఎంవో ఆదేశించింది.
రెవెన్యూ డేటాలోనే తప్పులు: భూరికార్డుల సమాచారం గందరగోళంగా ఉండటం వల్లే ఆలస్యం అవుతోందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలి పాయి. రెవెన్యూ విభాగం నుంచి వచ్చిన డేటా తప్పులతడకగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోజుకు 50 మంది సిబ్బంది సమాచారాన్ని ముందేసుకుని పేరుపేరునా రైతుల వివరాలను పరిశీలిస్తున్నారు. కొన్ని చోట్ల శ్మశాన వాటికలున్న భూములూ వ్యవసాయ భూములుగా ఈ డేటాలో ఉన్నట్లు బయటపడింది. తప్పులు ఉండటంతో రెవెన్యూ డేటాను సరిదిద్దేందుకు వ్యవసాయ శాఖ కుస్తీ పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment