పత్తి తగ్గింపు సరే..సోయా విత్తనాల మాటేంటి?
♦ సోయాబీన్ విత్తన బఫర్ స్టాక్ నిల్
♦ పత్తి విత్తన కంపెనీల కట్టడిలో మీనమేషాల లెక్కింపు
సాక్షి, హైదరాబాద్: పత్తి, సోయాబీన్ సాగుపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనల్లో పొంతన కుదరడంలేదు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా విత్తన సరఫరాలపై చర్యలు లేవు. పత్తి సాగు విస్తీర్ణాన్ని తగ్గించాలని, సోయాబీన్, కంది, మొక్కజొన్న తదితర పంటలను ప్రత్యామ్నాయంగా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేస్తోంది. అంతర్జాతీయ పత్తి ఎగుమతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుంకం పెంచినందున పత్తి ధరలు తగ్గుతాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇటీవల ‘మన తెలంగాణ-మన వ్యవసాయం’ కార్యక్రమంలో పత్తి సాగు వేయవద్దని వ్యవసాయశాఖ రైతుల్లో పెద్దఎత్తున ప్రచారం నిర్వహించింది. కానీ పత్తికి ప్రత్యామ్నాయంగా వేయాలన్న పంటల విత్తనాలను రైతులకు అవసరాలకు అనుగుణంగా సరఫరా చేయడం ప్రశ్నార్థకంగా మారింది. పైగా సోయాబీన్ పంటను కేవలం మూడు, నాలుగు జిల్లాల్లోనే ప్రధానంగా సాగు చేస్తున్నారు. ఈ నెల 15 నాటికే సోయా విత్తనాలను కనీసం సగానికిపైగా సిద్ధంగా ఉంచాలి. కానీ, ఇప్పటి వరకు ఒక్క క్వింటా కూడా సోయాబీన్ విత్తనాన్ని బఫర్ స్టాక్ పెట్టనేలేదు.
11.5 లక్షల ఎకరాల లక్ష్యం: 2015 ఖరీఫ్‌లో మొత్తం సాధారణ పంటల సాగు విస్తీర్ణం 1.03 కోట్ల ఎకరాలు కాగా... 88.82 లక్షల ఎకరాల్లో(86%) పంటలు సాగయ్యాయి. అందులో పత్తి 42.22 లక్షల ఎకరాలు సాగైంది. మొత్తం పంటలసాగులో పత్తి సాగే సగం మేరకు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో పత్తి సాగు విస్తీర్ణాన్ని కనీసం ఏడెనిమిది లక్షల ఎకరాల్లోనైనా తగ్గించి, ప్రత్యామ్నాయంగా సోయాబీన్, మొక్కజొన్న, కంది వంటి పంటలు సాగు చేయాలని సర్కారు రైతులకు విజ్ఞప్తి చేస్తోంది. గతేడాది 6.35 లక్షల ఎకరాల్లో సోయాబీన్ సాగైతే ఈసారి 11.5 లక్షల ఎకరాల్లో సాగును పెంచాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ఈసారి 3.75 లక్షల క్వింటాళ్ల సోయా విత్తనాలు అవసరం. దీంతో 22 ప్రైవేటు కంపెనీలను టెండర్లు పిలిచి సోయాబీన్ విత్తనాలు సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఇప్పటివరకు ఒక్క గింజ కూడా సిద్ధంగా లేదు. మరోవైపు పత్తి సాగు విస్తీర్ణం తగ్గింపుపై పత్తి కంపెనీలకు ఎటువంటి ఆదేశాలూ ఇవ్వలేదు. దీంతో ఆయా కంపెనీలు యధావిధిగా ఈ ఖరీఫ్‌కు కోటి విత్తన ప్యాకెట్లను సిద్ధం చేసుకుంటున్నాయి. దీనివల్ల అదను సమయంలో రైతులు వాటినే కొనుగోలు చేసే అవకాశం ఉంది.
పెరిగిన పత్తి సాగు సాధారణ విస్తీర్ణం: పత్తి తగ్గించాలని... సోయబీన్ వేయాలని చెబుతున్న వ్యవసాయ శాఖ తమ వెబ్‌సైట్లో 2016-17 ఖరీఫ్ సాధారణ విస్తీర్ణ వివరాలను ఉంచింది. అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల జేడీఏలను ఆదేశించింది. ఆ ప్రణాళిక ప్రకారం పత్తి సాగు విస్తీర్ణం గతేడాది కంటే పెరగడం గమనార్హం. గతేడాది పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 40.80 లక్షల ఎకరాలు కాగా... వచ్చే ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 42.70 లక్షల ఎకరాలుగా ప్రకటించారు. సోయాబీన్ సాగును 11.5 లక్షల ఎకరాల విస్తీర్ణానికి పెంచాలని ప్రచారం చేస్తోన్న వ్యవసాయశాఖ వెబ్‌సైట్లో మాత్రం సాధారణ సాగును 5 లక్షల ఎకరాలకు మించి చూపడంలేదు. ఇది సాధారణ సాగు విస్తీర్ణమే కానీ... వచ్చే ఖరీఫ్ ప్రణాళిక కాదని వ్యవసాయశాఖ అదనపు సంచాలకులు విజయ్‌కుమార్ ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. సాధారణ సాగుకు... ఖరీఫ్ ప్రణాళికకు సంబంధం లేదన్నారు.