సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతీ రైతు, ముఖ్యంగా పేద రైతులకు లబ్ధికలిగేలా పెట్టు బడి సాయాన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ‘సన్నకారు రైతుల్లో చాలా మందికి ఐదు గుంటలు... పది గుంటలు భూమి ఉంటుంది. అంతకంటే తక్కువ భూమి ఉండేవారూ ఉన్నారు. అటువంటి వారికి కూడా ప్రతీ గుంటనూ లెక్కించి పెట్టుబడి సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది’అని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఉదాహరణకు కేవలం ఒక గుంట భూమి ఉండి, అందులో కూరగాయలు పండించుకునే రైతులకు రూ.100 చొప్పున పెట్టుబడి సాయం అందజేయనున్నారు. పది గుంటల భూమి ఉంటే రూ. వెయ్యి చొప్పున ఇస్తారు. అంతేకాక ఒక రైతుకు ఒక ఎకరా, ఒక గుంట భూమి ఉంటే అతనికి ఆ లెక్కన రూ. 4,100 అందిస్తారు. ఈ మేరకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నట్టు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో రైతుల సంఖ్య ఎంత.., వారికి ఉన్న భూమి ఎంత? అనే వివరాలతో డాటా బేస్ రూపొందిస్తు న్నామని, గుంటలతో సహా వారి భూమిని నమోదు చేస్తామని ఆ వర్గాలు తెలిపాయి. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఆధారంగా రైతుల డాటా బేస్ ప్రకారం ఎవరికి ఎంత సొమ్ము ఇవ్వాలన్నదానిపై జాబితా తయారు చేస్తారు. దాన్ని బ్యాంకులకు అందజేస్తారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గ్రామసభలు పెట్టి రైతులకు చెక్కులను పంపిణీ చేస్తారు.
గ్రామాల్లో అర్హుల జాబితా ప్రదర్శన...
భూ రికార్డుల ప్రక్షాళనలో వెల్లడైన సమాచారం ప్రకారం రైతుల సంఖ్యను, భూముల వివరాలను తమకు ఇవ్వాలని వ్యవసాయ శాఖ రెవెన్యూ విభాగాన్ని కోరింది. ఈ మేరకు రెవెన్యూ శాఖకు లేఖ రాసినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా పెట్టుబడి సాయం పథకం కింద అర్హులైన రైతుల జాబితాను గ్రామాల్లో ప్రదర్శించాలని వ్యవసాయ శాఖ యోచిస్తోంది. రైతులందరికీ సొమ్ము ఇస్తున్నా, కొందరు అనర్హులు కూడా ఉండే అవకాశమున్న నేపథ్యంలో ప్రభుత్వం తయారు చేసే తుది జాబితాను ప్రదర్శిస్తే ఎవ రికి రాయితీ వచ్చింది, ఎవరికి రాలేదన్న విషయం తెలిసిపోతుంది. దానివల్ల రైతులం దరికీ స్పష్టత వస్తుంది. ఎవరికైనా అన్యాయం జరిగితే ఫిర్యాదు చేసే అవకాశముంటుంది. దీనికోసం కూడా ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసే అవకాశముందని అంటున్నారు.
గ్రామ సభల్లో చెక్కుల పంపిణీ
జాబితాను ప్రదర్శించిన తర్వాత గ్రామ సభల్లో ఆయా రైతులకు చెక్కులను అందజేస్తారు. మే ఒకటో తేదీ నుంచి 15వ తేదీ నాటికి చెక్కులను రైతులందరికీ పంపిణీ చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అధికారులు రోజుకొక గ్రామంలో సభ పెట్టి చెక్కులను పంపిణీ చేస్తారు. ఏ రోజు ఏ గ్రామంలో చెక్కులను పంపిణీ చేస్తారో ప్రచారం చేస్తారు. గ్రామంలో అర్హులైన రైతులందరికీ ఒకే రోజు చెక్కులు అందించేలా చూడాలని భావిస్తున్నారు. ఆ ప్రకారం 15 రోజుల్లో మండలంలోని అన్ని గ్రామాల్లో చెక్కుల పంపిణీ పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఒకవేళ నిర్ణీత రోజు ఎవరైనా చెక్కులు తీసుకోని పరిస్థితి ఉంటే మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తారు. అక్కడ ప్రతీ రోజూ చెక్కులు ఇచ్చేలా ఏర్పాటు చేస్తారు. గ్రామసభల్లో చెక్కుల పంపిణీ సందర్భంగా సర్పంచ్, ముఖ్యమైన రెవెన్యూ అధికారులు, ఎమ్మెల్యే, ఎంపీపీ తదితర ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యేలా ఏర్పాట్లుంటాయి. పెట్టుబడి సాయం చెక్కుల పంపిణీని ఒక పండుగలా చేయాలని ప్రభుత్వం భావిస్తోందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment