భద్రాద్రి పవర్ ప్లాంట్‌కు ‘గ్రీన్’ ట్రబుల్!
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా మణుగూరులో 1080 (270గీ4) మెగావాట్ల సామర్థ్యంతో తలపెట్టిన భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం విషయంలో తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) తీవ్ర చిక్కుల్లో పడింది. ఈ ప్లాంట్ నిర్మాణానికి జెన్‌కో పర్యావరణ అనుమతులు కోరితే మంజూరు చేయవద్దని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తాజాగా ఆదేశించింది. ఈ ప్లాంట్‌కి పర్యావరణ అనుమతులు జారీ చేయవద్దని సోమవారం జరిగిన విచారణలో ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని ఇంధన శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వివాదాల నేపథ్యం...
భద్రాద్రి విద్యుత్ ప్లాంట్‌ను ‘సబ్ క్రిటికల్’ బాయిలర్ టెక్నాలజీతో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌తో జెన్‌కో ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం అతి తక్కువ సమయంలో.. మార్చి 2015 నుంచి 32 నెలల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలి. నాలుగు యూనిట్లలో తొలి యూనిట్‌ను 24 నెలల్లోనే పూర్తి చేయాల్సి ఉండగా.. తర్వాత మూడు నెలలకో ప్లాంట్ చొప్పున మొత్తం 32 నెలల్లో నాలుగు ప్లాంట్లు నిర్మించాలి. ఇప్పటికే ఏడాది పూర్తయింది. కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఈ ప్లాంట్‌ను నిర్మించడం పట్ల తొలుత కేంద్ర పర్యావరణ శాఖ అభ్యంతరం తెలిపింది.
అధునాతన సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి మారాలని, లేకుంటే కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నుంచి ప్రత్యేక అనుమతులు పొందాలని షరతులు విధించింది. అయితే రాష్ట్రంలో విద్యుత్ కొరత నేపథ్యంలో అతితక్కువ కాలంలో నిర్మించాలన్న ఉద్దేశంతో అందుబాటులో ఉన్న సబ్ క్రిటికల్ బ్రాయిలర్లతో ఈ ప్లాంట్‌ను నిర్మిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. మరోవైపు పర్యావరణ అనుమతులు పొందకుండానే గతేడాది ఈ ప్లాంట్ నిర్మాణ పనులను జెన్‌కో ప్రారంభించడంతో ఓ స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదుపై స్పందించిన ఎన్జీటీ ప్రాజెక్టు పనులను నిలుపుదల చేస్తూ స్టే విధించింది. స్టేను ఉల్లంఘించి జెన్‌కో పనులను కొనసాగించడంతో కేంద్ర పర్యావరణ శాఖతో ఎన్జీటీ విచారణ జరిపించింది. తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిందని కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుడు ఎన్జీటీకి నివేదించారు. దీంతో తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయవద్దని గత నెల 7న ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.
ఈ నెల 5, 6వ తేదీల్లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ ఢిల్లీలో సమావేశమై దేశంలో నిర్మించనున్న కొత్త థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు పర్యావరణ అనుమతులు జారీ చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటుంది. ఈ సమావేశంలోనే భద్రాద్రి ప్లాంట్‌కి కూడా అనుమతుల అంశాన్ని పరిశీలించే విధంగా కేసు విచారణను ఈ నెల 17 నుంచి ముందుకు జరపాలని జెన్‌కో చేసిన విజ్ఞప్తి పట్ల ఎన్జీటీ సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు సోమవారం ఎస్జీటీ విచారణ జరిపింది. డిసెంబర్ 14న పనులు ఆపేశామని, ఈ విషయంలో పర్యావరణ మంత్రిత్వ శాఖ తప్పుడు నివేదిక సమర్పించిందని జెన్‌కో వాదించింది. ఈ విషయాన్ని అఫిడవిట్ రూపంలో సమర్పిస్తే తామే స్వయంగా విచారణ జరిపించి వాస్తవాలు తేలుస్తామని ఎన్జీటీ పేర్కొంది. అప్పటి వరకు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయవద్దని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖను ఆదేశించినట్లు తెలిసింది.