
'లైన్‌లో ఉన్న ప్రతీఒక్కరికి ఓటేసే సౌకర్యం'
ఓటరు లిస్ట్‌లో పేరుంటే చాలు 11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయొచ్చు అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ వెల్లడించారు. నేటి సాయంత్రం 6 గంటల వరకు లైన్లో ఉన్న ప్రతి ఒక్కరు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నగరంలో వివిధ పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. కొన్ని ఈవీఎంలలో లోపాలు ఉన్న మాట వాస్తవమే అని ఆయన అంగీకరించారు.
ఈవీఎంలు ఫ్యాక్టరీ మోడ్లోకి వెళ్తున్నాయన్నారు. అన్ని చోట్ల అదనపు ఈవీఎంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎక్కడ సమస్య వచ్చినా అరగంటలోపు ఈవీఎంలను రీప్లేస్ చేస్తామని భన్వర్లాల్ వెల్లడించారు. ఈవీఎంలు మొరాయిస్తున్న నేపథ్యంలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రాలలో లైన్లో నిలబడిన చివరి వ్యక్తి వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. 16,512 కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నగరంలోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని గమనించేందుకు ప్రధాన కూడళ్లలో తెరలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
నేడు ఎన్నికల సందర్బంగా... అన్ని సంస్థలకూ సెలవు ప్రకటించాలని ఆదేశించినట్లు చెప్పారు. అలాగే అత్యవరసర సేవల సంస్థలకూ మాత్రం ఓ షిఫ్ట్ సెలవు ఇవ్వాలని ఆదేశించామన్నారు. ఉద్యోగులకు సెలవు ఇవ్వని యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి... ఏడాది జైలు శిక్ష విధిస్తామన్నారు. అలాంటి సంస్థలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావలని అటు ఆయా సంస్థల ఉద్యోగులకు, ఇటు మీడియాకు ఆయన విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లు తీసుకెళ్లవద్దని ఓటర్లకు భన్వర్లాల్ సూచించారు.