దేశ స్వాతంత్ర్యం కోసం జీవితాంతం పోరాటం చేసి జైలు జీవితం అనుభవించి, దేశం కోసం నిరంతరం పాటుపడ్డ వ్యక్తి మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్య నిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క కొనియాడారు. స్వాతంత్ర్యానంతరం దేశానికి దిశా నిర్ధేశం చేసిన గొప్ప వ్యక్తి నెహ్రూ అని భట్టి అన్నారు. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వర్దంతి గాంధీభవన్‌లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా నెహ్రూ చిత్ర పటానికి నేతలు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. నెహ్రూ ఈ దేశానికి పటిష్టమైన ఆర్థిక పునాది నిర్మించారని, నేడు ప్రపంచంలో మన దేశం మూడో ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఆయన అవలంభించిన విధానాలే కారణమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
మాజీ పీసీసీ అధ్యక్షులు, ఎంపీ వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ప్రధాన కార్యదర్శి కుమార్ రావులతోపాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. అంతకు ముందు ఆబిడ్స్‌లోని నెహ్రూ విగ్రహానికి పొన్నాల లక్ష్మయ్య, మల్లు రవి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
నాటా సభల కోసం అమెరికాకు ఉత్తమ్..
నార్త్ అమెరికా తెలుగు అసొసియేషన్ (నాటా) ఆహ్వానం మేరకు మే 28, 29 తేదీలలో అమెరికాలోని డల్లాస్‌లో జరగనున్న నాటా సభలలో ముఖ్య అతిధిగా పాల్గొనేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం రాత్రి అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నారు. డల్లాస్‌లో జరగనున్న ఈ సభలలో ఆయన పాల్గొంటారు. అనంతరం తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం ఆధ్వర్యంలో జూన్ 3, 4 తేదీలలో డల్లాస్ లో జరగబోయే సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాల తర్వాత జూన్ 5వ తేదీన తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
నెహ్రూ పటిష్ట ఆర్థిక పునాది వేశారు: భట్టి విక్రమార్క
Published Fri, May 27 2016 8:01 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
Advertisement