'ఆయన్ని సుజనా భుజాలమీద మోస్తున్నారు'
తిరుపతి: కేంద్ర మంత్రి సుజనా చౌదరి హడావుడిగా గవర్నర్ నరసింహన్ను కలవడం వెనుక కారణమేంటి? అని వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశానికి గవర్నర్కు సంబంధం ఏమటి? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. బుధవారం తిరుపతిలో భూమన మీడియా సమావేశంలో మాట్లాడారు. గవర్నర్ తీరు పైనా అపనమ్మకం కలిగేలా టీడీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ విషయంపై రాజ్భవన్ వర్గాలు ప్రకన ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ఎవరికి లొంగరు కాబట్టి.. టీడీపీ అధినేత చంద్రబాబును కాపాడే బాధ్యతను సుజనా తన భుజాలపై వేసుకున్నారంటూ విమర్శించారు.
హైదరాబాద్లో చిన్నపాటి కేసుల్లో నిందితులనే అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నారు. కానీ, రాజ్యాగం పదవిలో ఉన్న చంద్రబాబును ఎందుకు వదిలేశారు' అని భూమన ఘాటుగా ప్రశ్నించారు. చంద్రబాబు.. తాను నిప్పుంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబూ.. ఇప్పటివరకూ మీకు ఏ కోర్టు కడిగిన ముత్యమని తీర్పునిచ్చిందో? చెప్పాలన్నారు. స్మగ్లర్ వీరప్పన్ కూడా 20 ఏళ్లు పోలీసులకు దొరకలేదు. ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలుసునని అన్నారు. ప్రపంచ దేశాలను గడగడలాడించిన బిన్లాడెన్ లాంటి ఘోరమైనటువంటి వాడికి కూడా ఆఖరి ఘడియ తప్పలేదని హితవు పలికారు. అలాగే చంద్రబాబు నేరాలు, ఘోరాల్లో ఇప్పటివరకూ దొరక్కపోయి ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజు చంద్రబాబు దొరకడం ఖాయమని భూమన జోస్యం చెప్పారు.