
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వాస్తవానికి ఏ తప్పూ చేయలేదని, ఆయనపై సోనియాగాంధీ–చంద్రబాబు కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగా పెట్టించిన కేసులన్నింటినీ కచ్చితంగా కొట్టివేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఆయన ఆదివారం హైదరాబాద్‌లో పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్‌పై కేసులు కొట్టేస్తారేమోనని చంద్రబాబు అనడం, దాన్ని ఓ పత్రిక పతాక శీర్షికన ప్రచురించడాన్ని భూమన ప్రస్తావించారు. తప్పుడు ఆరోపణలతో అన్యాయంగా, అక్రమంగా, మోసపూరితంగా అభియోగాలు మోపుతూ జగన్‌పై పెట్టిన కేసులను న్యాయస్థానాలు కచ్చితంగా కొట్టివేస్తాయని తేల్చిచెప్పారు. ధర్మం ఎప్పటికైనా గెలుస్తుందన్నారు. భూమన ఇంకా ఏం చెప్పారంటే...
‘‘చట్టంపై నమ్మకం లేని చంద్రబాబు, ఆయన మంత్రిమండలి, ఆయన ఎమ్మెల్యేలు, తైనాతీలకు ఈ కేసులపై అనుమానాలు ఉండొచ్చు గానీ మాకు మాత్రం చట్టం, న్యాయంపై అపారమైన నమ్మకం ఉంది. అందుకే ఈ కేసులపై విచారణ చేస్తున్న న్యాయస్థానాలు నిజాలను నిగ్గు తేలుస్తాయనే విశ్వాసం మాకు ఉంది. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక రెండున్నర దశాబ్దాలుగా శత్రువుగా చూసిన కాంగ్రెస్‌తో కూడా చేతులు కలుపుతున్నారు. తనను జగన్ ధిక్కరించారని సోనియా రగిలిపోతూంటే ఆజ్యం పోసింది టీడీపీ కాదా? సోనియాతో కలిస్తే గానీ జగన్‌ను ఎదుర్కోలేమని భావించి ఆయనపైకి సీబీఐని ఉసిగొల్పిన మాట నిజం కాదా? బాబు ఎంతకాలం అబద్ధాల శవ పేటికను మోస్తారు.
అడ్డదార్లు జగన్‌కు తెలియదు
జగన్‌పై కోపంతోనే చంద్రబాబు అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిశారు. తన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి మరీ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడారు. చంద్రబాబు చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకున్నది నిజం కాదా? అప్పటి న్యాయ మంత్రి భరద్వాజకు పాద పూజ చేసిన విషయం వాస్తవం కాదా? బాబు ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కొని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సాష్టాంగపడి హైదరాబాద్ నుంచి పారిపోయి రావడం నిజం కాదా?
విచారణకు సిద్ధమా బాబూ!
చంద్రబాబు పాలనలో అవినీతి జరగనట్లు పచ్చ పత్రికలు, కొన్ని వార్తా చానళ్లు ప్రజలను ఇంకా భ్రమల్లోనే ఉంచడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ, ప్రజలన్నీ గుర్తిస్తున్నారు. జగన్‌లోని పోరాట తత్వాన్ని, నిజాయతీని గుర్తించారు. బాబుకు దమ్ముంటే ఆరోపణలన్నింటిపైనా విచారణకు సిద్ధపడాలి’’అని భూమన సవాల్ విసిరారు.