
రోడ్లు కావవి.. నరక కూపాలు!
హైదరాబాద్ నగర రోడ్లపై అసెంబ్లీలో బీజేపీ మండిపాటు
- అవినీతి పెచ్చరిల్లుతోందని ఆరోపణ
- రాత్రికి రాత్రే విశ్వనగరంగా మారదన్న మంత్రి కేటీఆర్
- వచ్చే ఏడాదికి 5,400 పాఠశాలల్లో డిజిట్ పాఠాలు: కడియం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర రోడ్లన్నీ నరక కూపాలుగా మారాయని, వీటి పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వ ప్రణాళికలన్నీ పనికి రాకుండా పోయాయని ప్రభుత్వాన్ని బీజేపీ ఆరోపించింది. నగరం నిండా చెత్త పేరుకుపోయిందని, వాటికి పరిష్కారం చూపకుండా విశ్వ నగరం చేస్తామంటే నమ్మశక్యంగా లేదని విమర్శించింది. సోమవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ పక్ష నేత జి.కిషన్‌రెడ్డి, సభ్యులు కె.లక్ష్మణ్, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఈ అంశాన్ని లేవనెత్తారు. నగరంలో కాల్వలు పూడుకుపోయాయని, వాటి పూడిక తీయకపోవడంతో కొద్దిపాటి వర్షాలకే నగరం మునిగిపోయే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ఎక్కడా టాయిలెట్లు పని చేయడం లేదని, స్వయంగా మంత్రి వెళ్లి పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని సూచించారు. టౌన్‌ప్లానింగ్‌లో అవినీతి పేరుకుపోయిందని, భవనాలకు అడ్డగోలుగా అనుమతులిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం చెప్పిన వంద రోజుల ప్రణాళిక ఏమైందో చెప్పాలని నిలదీశారు.
ఒక్క రాత్రిలో విశ్వనగరం కాదు: మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగర రోడ్ల అభివృద్ధికి గతంలో కంటే ఎక్కువగానే ఖర్చు చేశామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘2014–15 ముందు వరకు నగర రోడ్లపై ఏటా రూ.250 కోట్లకు మించి ఖర్చు చేయలేదు. కానీ తెలంగాణ ఏర్పాటు అనంతరం 2014–15లో రూ.451 కోట్లు, 15–16లో రూ.455 కోట్లు ఖర్చు చేశాం. నగరంలో సీవరేజీ వ్యవస్థ మెరుగ్గా లేనందున రోడ్లపై నీటి నిల్వ చేరుతోంది. నాలాల ఆక్రమణలు కూడా మరో కారణం. వీటిని దృష్టిలో పెట్టుకొని వైట్ ట్యాపింగ్ రోడ్లు వేస్తున్నాం. ఐటీ కారిడార్‌లో రూ.200 కోట్లతో వైట్ ట్యాపింగ్ రోడ్లకు టెండర్లు పిలిచాం. విశ్వనగరాలు ఒక్క రాత్రిలో ఏర్పడవు. సమస్యలను పరిష్కరించుకుంటూ కొత్త మార్గంలో ముందుకెళ్తున్నాం. అక్రమ భవనాల కట్టడికి బిల్డింగ్ ట్రిబ్యునల్ బిల్లు తెస్తున్నాం’ అని వివరించారు.
ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఆగ్రహం..
ఈ సందర్భంగా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఎంత కోరినా స్పీకర్ మధుసూదనాచారి అంగీకరించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన అక్బరుద్దీన్ ‘మీ ఇష్టారీతిన సభను నడుపుకోండి’ అని ఆవేశంగా అన్నారు. అక్బరుద్దీన్‌కు మద్దతుగా బీజేపీ సభ్యులు లేవడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ స్పందిస్తూ ‘ఒక్క ప్రశ్నతోనే సభను నడిపిద్దామంటే అలానే చేద్దాం’ అన్నారు. అయినా వెనక్కి తగ్గని అక్బరుద్దీన్ మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండంటూ కూర్చున్నారు. నగర వ్యవస్థపై లఘుచర్చకు అనుమతిస్తామని చెప్పడంతో అంతా శాంతించారు.
ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు
‘రాష్ట్రంలో ఈ ఏడాది 3,472 ఉన్నత, మోడల్ పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు ఆరంభించాం. వచ్చే ఏడాది నుంచి 5,400 ఉన్నత పాఠశాలల్లోనూ ఆరంభిస్తాం. ఇప్పటికే అవసరమైన సామగ్రిని సరఫరా చేశాం’ అని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. సభ్యులు గాదరి కిశోర్, సండ్ర వెంకట వీరయ్య, అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్నలకు కడియం సమాధానమిచ్చారు. పాఠశాలల్లో మెరుగైన బోధనకు ఇప్పటికే 9 వేల మంది విద్యా వలంటీర్లను నియమించామని, జిల్లాల విభజన నేపథ్యంలో డీఎస్సీ ప్రకటన ఆలస్యమైందని, త్వరలోనే డీఎస్సీ నిర్వహించి పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు.
బలవంతపు భూసేకరణ
ఫార్మా సిటీ పేరిట ప్రభుత్వం రైతుల నుంచి బల వం తంగా భూసేకరణ చేస్తోం దని కాంగ్రెస్ సభ్యుడు వం శీచంద్‌రెడ్డి విమర్శించారు. పట్టా, అసైన్డ్ భూ ములకు ఒకే ధర చెల్లించాల్సి ఉన్నా అలా చేయడం లేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం భక్షక పాత్ర పోషిస్తోందని మండిపడ్డారు.
ఫార్మా సిటీతో 3 లక్షల ఉద్యోగాలు
ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి
మచ్చర్లలో ఏర్పాటు చేస్తున్న ఫార్మా సిటీతో 3 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, ఉగ్యోగ అవకాశాలు దక్కుతాయని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే 5,646 ఎకరాల మేర భూసేకరణ చేశామని, మరింత చేయాల్సి ఉందని తెలిపారు. రైతులు ముందుకొచ్చిన చోట జీవో 123 మేరకు, కోరితే 2013 చట్టం మేరకు భూసేకరణ చేస్తున్నామని పేర్కొన్నారు. సేకరణ ప్రాథమిక దశలో ఉండగానే 8,500 ఎకరాలకు పలు సంస్థల నుంచి డిమాండ్లు వచ్చాయని వివరించారు. 2018 చివరికల్లా మొదటి దశ ఆరంభిస్తామని సభ్యులు వంశీచంద్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.