కేసీఆర్ కుటుంబం తప్ప నగరం అభివృద్ది చెందలేదు
అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి
చైతన్యపురి: టీఆర్‌ఎస్ ఏర్పడ్డ 18నెలల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం అభివృద్ది చెందింది తప్ప నగర అభివృద్ది జరగలేదని బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. చైతన్యపురి బీజేపి అభ్యర్ధి రంగానర్సింహగుప్త ప్రచారంలో బాగంగా గురువారం డివిజన్‌లోని భవానినగర్, చైతన్యపురి, బాబుకాంప్లెక్స్, ప్రభాత్‌నగర్, సాయినగర్‌లలో జరిగిన రోడ్‌షోలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఓల్డ్ సిటీని ఒవైసి సోదరులు, న్యూసిటీని అన్నాచెల్లెళ్లు కేటీఆర్, కవితలు ఇదినాకు అది మీకు అని పంచుకుంటున్నారని విమర్శించారు. రెండు కుంటుంబాల మద్య నగరాన్ని నలిగిపోనివ్వమని పేర్కొన్నారు. హైదరాబాద్ భవిష్యత్తు, రక్షణకు సంబందించి గ్రేటర్ ఎన్నికలు కీలకమైనవని అన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం నగరంలో రోడ్ల గుంతలు పూడ్చిందా, కాలుష్యాన్ని తగ్గించిందా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి సహకారం లేకుండా నగరాన్ని కేసీఆర్ అభివృద్ది చేయగలరా అన్నారు. బీజేపి లేని నగరాన్ని ఊహించుకోలేమని, బాంబుపేలుళ్ల సమయంలో నగర ప్రజలకు బీజేపి అండగా ఉందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల, ప్రాంతాల, అన్నివర్గాల ప్రజలు నివసిస్తున్నారని నగరం మజ్లీస్, టీఆర్‌ఎస్‌లది కాదని అన్నారు. బీజేపి అభ్యర్ధులను గెలిపిస్తే కేసీఆర్ మెడలు వంచి అయినా డివిజన్‌ల అభివృద్ది చేస్తామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే రంగా నర్సింహగుప్తను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బద్దం సుభాష్‌రెడ్డి, నాయకులు శంకర్‌రెడ్డి, హరిబాబు, రుద్రారపు శంకర్, వినోద్‌యాదవ్, శివ, శివవోజా, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్, ఎంఐఎం సోదర పార్టీలు....
హయత్‌నగర్: టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు సోదర పార్టీలని నగరంలో ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించాలంటే మిత్ర పక్షాలైన బీజేపి టీడీపి అభ్యర్ధులను గెలిపించాలని కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో బాగంగా హయత్‌నగర్ డివిజన్ బీజేపి అభ్యర్ధి కళ్లెం రవీందర్‌రెడ్డికి మద్దతుగా ఆయన గురువారం ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఏర్పడితే తమ బతుకులు బాగుపడతాయని ఎంతో మంది త్యాగం చేస్తే తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని విమర్శించారు. నగర ప్రజలకు బీజేపి అండగా ఉంటుందన్నారు. ప్రజల బతుకులు దుర్బరంగా మారాయని వారి బతుకుల్లో వెలుగులు నింపాలంటే బీజేపి గెలవాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు నక్కరవీంర్‌గౌడ్, నాయకులు బోడ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.