
'ఉప ఎన్నికపై పెట్టిన శ్రద్ధ...పాలనపై లేదు'
హైదరాబాద్: పాలేరు ఉప ఎన్నికపై పెట్టిన శ్రద్ధ..పాలనపై పెడితే కరువుతో అల్లాడే రైతులకు కాస్తంత ఉపశమనం దక్కేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. కరువుపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మంగళవారం హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద బీజేపీ ధర్నా చేపట్టింది.
ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇలాంటి కరువును, ఇలాంటి కసాయి సర్కారును ఇప్పటి వరకు చూడలేదన్నారు. రైతులు చనిపోతున్న ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. రైతుల సమస్యలపై టీ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని లక్ష్మణ్ దుయ్యబట్టారు.
రాష్ట్రంలో కరువు పరిస్థితులను గురించి చెప్పుకోవటానికి కేసీఆర్ ప్రభుత్వం సిగ్గుపడుతోందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రం ఇచ్చిన నిధులను వెంటనే జిల్లాలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ఎన్ని రోజులు సెక్రటేరియట్‌కు వచ్చారో వెల్లడించాలన్నారు. ఎవరిని పడితే వారిని పార్టీలోకి చేర్చుకుంటున్నారు. అదే సీఎం కేసీఆర్కు భస్మాసుర హస్తం అవుతుందని చింతల ఎద్దేవా చేశారు.