పండగ జోరు.. చలో పల్లె‘టూరు’
= సొంతవూళ్లకు తరలిన నగరవాసులు
= తెలంగాణ జిల్లాలకే పెద్ద ఎత్తున ప్రయాణం
= సమ్మె విరమణతో కదిలిన సీమాంధ్ర బస్సులు
= తగ్గిన రైళ్ల రద్దీ..
= తుపాన్‌తో ప్రయాణాల విరమణ
= రెండు హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు
సాక్షి, సిటీబ్యూరో : నగరం పల్లెబాట పట్టింది. దసరా వేడుకల కోసం నగరవాసులు సొంతవూళ్లకు తరలి వెళ్లారు. గత వారం రోజులుగా కొనసాగుతున్న ప్రయాణాలు శనివారం తార స్థాయికి చేరుకొన్నాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధులకు హాజరుకావడంతో సీమాంధ్ర జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో బస్సులు నగరానికి చేరుకొన్నాయి.
దీంతో ఇటీవల వరకు తెలంగాణ జిల్లాలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు చాలా రోజుల తరువాత శనివారం విజయవాడ, కడప, కర్నూలు, తిరుపతి, గుంటూరు తదితర ప్రాంతాలకు తరలి వెళ్లాయి. మరోవైపు నగర శివార్ల నుంచి సైతం ప్రజలు భారీ సంఖ్యలో ఊళ్లకు వెళ్లారు. ఒక్క శనివారమే 900కి పైగా బస్సులు వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్లినట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ సి.వినోద్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు.
రెండురోజుల క్రితం వరకు పలుచగా ఉన్న మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్‌లలో సందడి నెలకొంది. మొత్తంగా ఈ ఏడాది సీమాంధ్రలో కొనసాగిన నిరవధిక సమ్మె, నిలిచిపోయిన బస్సుల కారణంగా ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గింది. తెలంగాణ జిల్లాలకు మాత్రమే పెద్దసంఖ్యలో ప్రజలు తరలి వెళ్లారు. పైగా బతుకమ్మ, దసరా వేడుకలకు తెలంగాణలో ఉండే ప్రాధాన్యం దృష్ట్యా ఈ ప్రాంత ప్రజలే ఎక్కువ సంఖ్యలో సొంతవూళ్లకు వెళ్లారు. తెలంగాణ జిల్లాలకు వెళ్లే వాళ్ల కోసం ఆర్టీసీ నాలుగు రోజుల ముందు నుంచే అదనపు బస్సులను ఏర్పాటు చేసింది.
వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, తదితర జిల్లాలకు ప్రయాణికుల రద్దీని బట్టి అదనపు బస్సులు నడిపారు. మరోవైపు నగర శివార్ల నుంచి సైతం ప్రజలు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, సొంత వాహనాలు, రైళ్లలో వెళ్లారు. మొత్తంగా ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్య చాలా వరకు తగ్గింది. సాధారణంగా దసరా, సంక్రాంతి వంటి పర్వదినాల్లో హైదరాబాద్ నుంచి కనీసం 20 నుంచి 30 లక్షల మంది సొంత ఊళ్లకు తరలి వెళితే ఈ ఏడాది 10 నుంచి 15 లక్షల మంది మాత్రమే వెళ్లినట్లు అంచనా. వారిలోనూ తెలంగాణ జిల్లాలదే అగ్రస్థానం.
యథావిధిగా ‘ప్రైవేట్’ దోపిడీ
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ బస్సులు యథావిధిగా తమ దోపిడీ పర్వాన్ని కొనసాగించాయి. ఆర్టీసీ సమ్మెతో ప్రైవేట్ ఆపరేటర్లకు ఈ ఏడాది కనకవర్షం కురిసింది. అది చాలదన్నట్లు వారు రెట్టింపు చార్జీలు వసూలు చేసి ప్రయాణికులపై నిలువు దోపిడీకి పాల్పడ్డారు. రైళ్లు చాలక, ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణం తప్పనిసరి అనుకున్న ప్రయాణికులు రూ.వేలకు వేలు కుమ్మరించి సొంత ఊళ్లకు వెళ్లాల్సి వచ్చింది.
మరోవైపు ప్రైవేట్ బస్సులే కాకుండా టాటా ఏసీ, ఓమ్ని వ్యాన్‌లు, మెటాడోర్‌లు, ట్యాక్సీలు, కార్లు వంటి ప్రైవేట్ వాహనాలు సైతం తెలంగాణ జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల నుంచి దోచుకున్నాయి. బాలానగర్, చింతల్ నుంచి నర్సాపూర్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ చార్జీ రూ.35 అయితే, ఈ వాహనాలు ఒక్కొక్కరి దగ్గర రూ.100 చొప్పున వసూలు చేశాయి. ఉప్పల్ నుంచి జనగామ, హన్మకొండ, ఎల్‌బీనగర్ నుంచి నకిరేకల్, ఖమ్మం, సూర్యాపేట్ తదితర ప్రాంతాలకు వెళ్లిన ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల దారిదోపిడీకి గురయ్యారు.
తగ్గిన రైళ్ల రద్దీ
గత వారం రోజులుగా ప్రయాణికులతో కిటకిటలాడిన రైళ్లలో శనివారం రద్దీ తగ్గుముఖం పట్టింది. ఇప్పటికే చాలామంది సొంతూళ్లకు వెళ్లిపోవడం ఒక కారణమైతే ఫై-లీన్ తుపాన్ ప్రభావం వల్ల పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు రద్దు కావడంతో చాలామంది ప్రయాణాలు విరమించుకున్నారు. దీంతో సికింద్రాబాద్ రిజర్వేషన్ కార్యాలయం వద్ద టికెట్ల రద్దు కోసం వచ్చినవారి సంఖ్య ఎక్కువగా కనిపించింది. తుపాన్ ప్రభావం వల్ల రద్దయిన, పాక్షికంగా రద్దయిన, దారి మళ్లిన రైళ్ల వివరాలను తెలుసుకొనేందుకు సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లలో అధికారులు రెండు హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్‌లను అందుబాటులోకి తెచ్చారు.
సికింద్రాబాద్ హెల్ప్‌లైన్ : 040-27700868
నాంపల్లి హైల్ప్‌లైన్ : 040-23200865