సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో ఓటేసేందుకు చాలామంది హైదరాబాద్ వాసులు సొంతూళ్ల బాట పట్టారు. పోలింగ్ రోజు గురువారం(నవంబర్30)న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో సొంతూళ్లలో ఓట్లున్నవారు స్వస్థలాలకు పయనమయ్యారు. ఒక్కసారిగా నగర వాసులు సొంతూళ్లకు బయలుదేరడంతో నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టేషన్లు రద్దీగా మారాయి. పండగల ముందురోజుల్లో ఉన్నట్లుగా కిక్కిరిసిపోయాయి. బస్సులన్నీ నిండిపోవడంతో సీట్ల కోసం జనం ఎగబడుతున్నారు. ఎలాగైనా ఊరెళ్లి ఓటెయ్యాలన్న ఉద్దేశంతో సీట్లు దొరకకపోయిన బస్సుల్లో నిల్చొని ప్రయాణించేందుకూ సిద్ధమవుతున్నారు.
ఓటేసేందుకు స్వచ్ఛంధంగా ఊళ్లకు వెళ్లే వారు కొందరైతే పార్టీల పోల్ మేనేజ్‌మెంట్ ఎఫెక్ట్‌తో ఊరి బాట పట్టేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఊళ్లలోని ప్రధాన పార్టీల స్థానిక నాయకులు ఫోన్లు చేసి మరీ హైదరాబాద్‌లో ఉంటున్న ఆయా ఊళ్లకు సంబంధించిన వారిని ఓటేసేందుకు రమ్మని పిలుస్తున్నట్లు సమాచారం. దీంతో సొంత నియోజకవర్గాల్లో తమ అభిమాన పార్టీని, నాయకుడిని గెలిపించుకునేందుకు నగరవాసులు స్వస్థలాలకు బయలుదేరారు.
హైదరాబాద్‌కు ఉద్యోగ,వ్యాపార రీత్యా, ఇతరకారణాలతో వచ్చి నివసిస్తున్న వారిలో చాలా మందికి నగరంలో ఓటు హక్కు లేదన్న విషయం తెలిసిందే. వీరంతా తమ ఓటును సొంతూళ్లలోనే నమోదు చేయించుకున్నారు. పోలింగ్ రోజు ఓటేయ్యకుండా హైదరాబాద్‌లో ఉండటానికి వీరు సాధారణంగా ఆసక్తి చూపరు. ఓటు హక్కును ఎట్టి పరిస్థితుల్లో తమ స్వస్థలాల్లో వినియోగించుకోవాలని చాలా మంది ఊరి బాట పట్టారు.
Comments
Please login to add a commentAdd a comment