స్వైన్..రన్
గ్రేటర్‌లో మళ్లీ విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ
వాతావరణ మార్పులతో మరింత బలపడిన వైరస్
మూడు మాసాల్లో పది మంది మృతి
300పైగా కేసులు నమోదు
సిటీబ్యూరో: కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న హెచ్1ఎన్1 స్వైన్‌ఫ్లూ వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఇటీవల వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల స్వైన్‌ఫ్లూ కారక వైరస్ మరింత బలపడి బస్తీ వాసులపై విరుచుకుపడుతోంది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2550 నమూనాలు సేకరించి, వ్యాధి నిర్ధారణ కోసం ఐపీఎంకు పంపగా వీటిలో 319 పాజిటివ్ వచ్చాయి. వీటిలో ఒక్క హైదరాబాద్, రంగారెడ్డిలోనే 150పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఈ మూడు మాసాల్లో 92 మందికి వైద్యసేవలు అందించగా వీరిలో పది మంది మృతి చెందారు. దీంతో గ్రేటర్ వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల వాతావరణంలో భిన్న మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పగలు 35-36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం, సాయంత్రం ఉక్కపోత, తెల్లవారు జామున చలిగాలులు వీస్తున్నాయి. ఇలా ఒకే రోజూ మూడు రకాల మార్పులతో వాతావరణంలో స్వైన్‌ఫ్లూ కారక వైరస్ మరింత బలపడుతున్నట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, బాలింతలు, చిన్నారులపై పంజా విసురుతోంది.
ఇలా గత గురువారం ఒక్క రోజే నలుగురు బాధితులు మృతి చెందారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ నోడల్ కేంద్రాలను ఏర్పాటు చేసినా..ప్రస్తుతం ఒక్క గాంధీలోనే వైద్య సేవలు అందుతున్నాయి. సిబ్బంది కొరత వల్ల సేవల్లో జాప్యం జరుగుతుండటంతో రోగులు మత్యువాత పడుతున్నారు. దీంతో కొంత మంది రోగులు గాంధీ నుంచి డిశ్చార్జ్ చేయించుకుని కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన ఆయా ఆస్పత్రులు వైద్య పరీక్షలు, మందుల పేరుతో రోగులను నిలువునా దోచుకుంటున్నాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందుల(ఒసల్టా మీ వీర్ టాబ్లెట్స్, సిరప్)ను ఉచితంగా ఇస్తున్నా..వాటికి కూడా ఖరీదు కడుతున్నాయి.
డెంగీ బూచీ..కాసులు దోచి..
స్వైన్ ఫ్లూతో పాటు డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 275 డెంగ్యూ కేసులు నమోదు కాగా, 134 మలేరియా కేసులు నమోదయ్యాయి. కేవలం సెప్టెంబర్‌లోనే 98 డెంగీ కేసులు నమోదు కాగా, 28కి పైగా మలేరియా కేసులు నమోదు కావడం గమనార్హం. వ్యాధి నిర్ధారణ కోసం ప్రభుత్వం‘ఐజీఎం ఎలీసా’టెస్టును ప్రామాణికంగా ప్రకటించింది. కానీ పలు కార్పొరేట్ ఆస్పత్రులు ‘ఎన్‌ఎస్ 1’ టెస్టును డెంగీ పాజిటివ్‌గా పేర్కొంటూ చికిత్స చేస్తున్నాయి. సాధారణ జ్వరాలను సైతం డెంగీ జాబితాలో చేర్చుతూ రోగులను మోసం చేస్తున్నాయి. ఆస్పత్రి పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన రోగుల నుంచి మరోసారి రక్తపు నమూనాలు సేకరించి ఐపీఎంకు పంపాలనే నిబంధన ఉన్నా చాలా ఆస్పత్రులు దీన్ని పట్టించుకోవడం లేదు. గుట్టు చప్పుడు కాకుండా చికిత్సలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాయి.