ఇరు రాష్ట్రాల అసెంబ్లీల్లో 'బాహుబలి'కి అభినందనలు
హైదరాబాద్: కలెక్షన్ల పరంగా సునామీ సృష్టించిన ‘బాహుబలి’ చిత్రం 2015వ సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన సంగతి తెలిసిందే. సోమవారం ప్రకటించిన 63వ జాతీయ ఫిల్మ్ అవార్డుల్లో 'బాహుబలి'కి జాతీయ ఉత్తమ చిత్రంగా, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ చిత్రంగా రెండు అవార్డులు దక్కించుకుంది. ఒక తెలగు సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా నిలవటం ఇదే తొలిసారి కవడంతో మంగళవారం రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభలు కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించాయి.
తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్టాడుతూ 'ఒక తెలుగు చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపిక కావటం మొదటిసారని సీపీఐ సభ్యులు నాకు చెప్పారు. సభ తరఫున 'బాహుబలి' చిత్ర యూనిట్ కు అభినందనలు తెలుపుదాం'అని అన్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలోనే కాక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన కార్యక్రమంలోనూ బాహుబలి, కంచె సినిమాలపై ప్రశంసలు కురిపించారు.
'ఈ రోజు మనకు రెండు పండుగలు. ఒకటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావదినోత్సవమైతే, రెండోది ఒక తెలుగు చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం లభించడం. అదీ.. తెలుగువారి సత్తా' అని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా బాహుబలిని బహుబలిగా చంద్రబాబు పలికితే, కేసీఆర్ తనదైన మార్కు'ఆ సినిమా పేరేదో ఉండే..'అని సభ్యులను అడగటంతోపాటు 'నిజానికి నేను ఆ సినిమా చూడలేదు' అని వ్యాఖ్యానించారు.