బాబూ... ఇదేనా మర్యాద?
* గురువారం సాయంత్రం ఆర్భాటంగా పుష్కర వేడుకలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం
* శుక్రవారం ఉదయం లాంఛనంగా పుష్కరాలు ప్రారంభించిన సీఎం
* 12 గంటలు గడిచిన తర్వాత విపక్ష నేతకు ఆహ్వానమంటూ డ్రామా
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం మర్యాద తప్పి వ్యవహరించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పుష్కరాలకు ఆహ్వానించేందుకు.. పుష్కరాలు ప్రారంభమైన 12 గంటల తర్వాత మంత్రిని ఆయన ఇంటికి పంపింది. పుష్కరాలను అట్టహాసంగా నిర్వహిస్తామని ప్రభుత్వం కొన్ని నెలల ముందే చెప్పింది.
దేశ, విదేశాల్లోని ప్రముఖులను ఆహ్వానిస్తున్నామని సీఎం చంద్రబాబు పలుమార్లు విలేకరులకు చెప్పారు. గత నెలలో ఢిల్లీలో జరిగిన అంతర్రాష్ట్రమండలి సమావేశానికి వెళ్లినప్పుడే పుష్కరాలకు రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించినట్లు తెలిపారు. గత వారం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులను ఆహ్వానించేందుకు ఢిల్లీ వె ళ్లిన చంద్రబాబు మరోమారు ప్రధానిని కలసి ఆహ్వానించారు. దీన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ రాష్ట్రంలో ప్రతిపక్ష నేత విషయంలో ప్రభుత్వం అనుసరించిన వైఖరినే అందరూ తప్పుపడుతున్నారు.
ఇతర ప్రముఖుల మాదిరిగా ప్రతిపక్ష నేత జగన్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఆహ్వానించాలి. పుష్కరాలను ప్రారంభిస్తూ చంద్రబాబు దంపతులతో పాటు వివిధ పీఠాల అధిపతులు స్నానమాచరించిన తరువాత తీరికగా శుక్రవారం సాయంత్రం జగన్‌ను ఆహ్వానించేందుకు మంత్రి రావెల కిషోర్‌బాబును పంపింది. జగన్ హైదరాబాద్‌లో అందుబాటులో లేకపోవటం వల్ల ఆలస్యం చేశారా? అంటే అదీ లేదు. ఆయన హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఏపీలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు కూడా. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వారం రోజుల పాటు హైదరాబాద్‌లో మకాం వే శారు. పలువురు సినీ ప్రముఖుల ఇళ్లకు వెళ్లి ఆహ్వానించారు. కానీ ప్రభుత్వ పెద్దలు విపక్ష నేతను మాత్రం విస్మరించారు.
జగన్ నివాసానికి మంత్రి రావెల
పుష్కరాలకు ఆహ్వానించేందుకు జగన్ అపాయింట్‌మెంట్ కావాలని కోరుతూ గురువారం సాయంత్రం మంత్రి రావెల కిషోర్‌బాబు కార్యాలయం నుంచి వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి ఫోన్ వచ్చింది. అయితే జగన్ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళుతున్నారని, శనివారం ఉదయం 10 గంటలకు రావాలని పార్టీ నేతలు జవాబిచ్చారు. శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో రావెల విలేకరులతో మాట్లాడారు.
కొద్దిసేపటికి జగన్‌ను పుష్కరాలకు ఆహ్వానించేందుకు రావెల వెళుతున్నారని, దీన్ని కవర్ చేయాలంటూ టీడీపీ మీడియా విభాగం విలేకరులకు ఎస్సెమ్మెస్‌లు పంపింది. రాత్రి 7.30 ప్రాంతంలో రావెల, ప్రభుత్వ విప్ రవికుమార్‌లు లోటస్‌పాండ్‌కు వెళ్లారు. అక్కడే ఉన్న వైఎస్సార్‌సీపీ నేత పార్థసారథి, తదితరులు మీకు శనివారం ఉదయం సమ యం ఇచ్చారు కదా.. అనడంతో వారు వెనుది రిగారు. రాజధాని అమరావతికి భూమిపూజ, శంకుస్థాపనలను టీడీపీ సొంత వ్యవహారం లా నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడూ అదే తీరులో వ్యవహరించడం విమర్శల పాలైంది.