పేలుడు నుంచి తీర్పు దాకా.. | Brief About Mecca Masjid bomb blast | Sakshi

పేలుడు నుంచి తీర్పు దాకా..

Published Tue, Apr 17 2018 1:57 AM | Last Updated on Tue, Apr 17 2018 1:57 AM

Brief About Mecca Masjid bomb blast  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చరిత్రాత్మక మక్కా మసీదులో బాంబు పేలుడు జరిగి పదకొండేళ్లు అవుతోంది. కేసు దర్యాప్తు నాలుగు చేతులు మారింది. మొత్తం పది మందిని నిందితులుగా చేర్చగా.. అందులో ముగ్గురు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. ఆరుగురిని అరెస్టు చేయగా.. ఐదుగురిపై న్యాయస్థానంలో అభియోగ పత్రాలు దాఖలయ్యాయి.

ఒక నిందితుడు 2007లో మధ్యప్రదేశ్‌లో హత్యకు గురయ్యాడు. మొత్తంగా సుదీర్ఘ విచారణ తర్వాత సోమవారం ఈ కేసు వీగిపోయింది. అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురినీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. పేలుడు నాటి నుంచి తీర్పు ఈ కేసులో కీలక పరిణమాలు ఇవీ..

2007 మే 18
మధ్యాహ్నం 1.25 గంటలకు మక్కా మసీదులో బాంబు పేలుడు సంభవించింది. ఘటనాస్థలంలోనే ఐదుగురు మరణించగా.. నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో 58 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన తర్వాత చెలరేగిన అల్లర్లను అదుపు చేయడానికి జరిగిన పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. మక్కా మసీదులో పేలకుండా ఉన్న మరో బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
2007 మే 24
మక్కా మసీదు పేలుడు, బాంబు దొరికిన కేసుల దర్యాప్తు బాధ్యతను స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం (సిట్‌) నుంచి సీబీఐకి అప్పగించారు. తొలుత స్థానిక హుస్సేనీ ఆలం పోలీసుస్టేషన్‌లో కేసులు నమోదు చేసినా.. తర్వాత సీసీఎస్‌లోని సిట్‌కు బదిలీ అయ్యాయి.  
2007 జూన్‌ 10
అప్పటి సీబీఐ ఎస్పీ ఆర్‌.ఎస్‌.దినకర్‌ ప్రసాద్‌ నేతృత్వంలో డీఎస్పీ ఠాకూర్, ఇన్‌స్పెక్టర్లు శర్మ, ప్రక్యాల్‌లతో కూడిన బృందం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వచ్చి అధికారికంగా దర్యాప్తు ప్రారంభించింది.
2008 అక్టోబర్‌ 28
మహారాష్ట్రలోని మాలేగావ్‌ పేలుడు కేసులో అక్కడి యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) అధికారులు అభినవ్‌ భారత్‌ సంస్థకు చెందిన సాధ్వీ ప్రజ్ఞాసింగ్, శ్రీకాంత్‌ పురోహిత్‌లను అరెస్టు చేశారు. వారిని విచారించినప్పుడు రాజస్తాన్‌లోని అజ్మీర్‌లో పేలుళ్లకు బాధ్యులైన దేవేంద్ర గుప్తా, లోకేశ్‌ శర్మ, రామచంద్ర, సందీప్‌ల పేర్లు బయటికి వచ్చాయి.
2010 ఏప్రిల్‌ 28
రాజస్తాన్‌ పోలీసులు దేవేంద్ర గుప్తా, లోకేశ్‌ శర్మలను అరెస్టు చేసి విచారించిన సమయంలో.. మక్కా మసీదులో పేలుళ్లకు పాల్పడింది కూడా తామేనని వెల్లడించారు. దీంతో సీబీఐ అధికారులు వారిని విచారించాలని నిర్ణయించారు.  
2010 జూన్‌ 11
దేవేంద్ర గుప్తా, లోకేశ్‌ శర్మలను తీసుకువచ్చి, విచారించేందుకు సీబీఐ అధికారులు నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారంట్లు పొందారు.
2010 జూన్‌ 18
ప్రత్యేక బృందంతో రాజస్తాన్‌కు వెళ్లిన సీబీఐ అధికారులు.. దేవేంద్ర, లోకేశ్‌లను హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. న్యాయస్థానం అనుమతితో వారిని కస్టడీలోకి తీసుకుని విచారించగా.. స్వామి అసీమానంద పేరు వెలుగులోకి వచ్చింది.
2010 నవంబర్‌ 19
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో మారుపేరుతో రహస్య జీవితం గడుపుతున్న స్వామి అసీమానందను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. రామచంద్ర, సందీప్‌ల కోసం గాలింపు ముమ్మరం చేశారు.
2010 డిసెంబర్‌ 13
ఈ కేసులో సీబీఐ అధికారులు ప్రిలిమినరీ చార్జిషీట్‌ దాఖలు చేశారు. అసీమానంద మినహా మిగతా ఇద్దరు నిందితులు దేవేంద్ర, లోకేశ్‌లపై నాంపల్లి కోర్టులో 75 పేజీల అభియోగపత్రం దాఖలు చేశారు. అప్పట్లో అసీమానంద పోలీసు కస్టడీలో ఉండటంతో అభియోగాలు నమోదు చేయలేదు.
2011 ఏప్రిల్‌ 7
కేంద్ర హోం శాఖ నిర్ణయం మేరకు మక్కా పేలుడు కేసు దర్యాప్తు సీబీఐ నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు బదిలీ అయింది. పరారీలో ఉన్న రామచంద్ర, సందీప్, అశోక్‌లపై రూ.20 లక్షల రివార్డు ప్రకటించిన ఎన్‌ఐఏ.. గాలింపు ముమ్మరం చేసింది.
2011–2013
ఈ కేసులో ఎన్‌ఐఏ అధికారులు 2011 మే, 2012 జూలై, 2013 ఆగస్టులలో అసీమానంద సహా పలువురిపై మూడు సప్లిమెంటరీ చార్జిషీట్లు దాఖలు చేశారు. అరెస్టైన వారిలో తేజోరామ్‌ పర్మార్‌పై మాత్రం అభియోగాలు నమోదు కాలేదు. సాక్షుల ప్రాణాలకు ముప్పు ఉందనే ఉద్దేశంతో వారి వివరాలను గోప్యంగా ఉంచారు.  
2018 ఏప్రిల్‌ 16
నిందితులను దోషులుగా నిరూపించడానికి అవసరమైన సాక్ష్యాధారాలు సేకరించలేకపోవడం, ప్రాసిక్యూషన్‌ వైఫల్యం, అనేకమంది సాక్షులు ఎదురుతిరిగిన నేపథ్యంలో మక్కా పేలుడు కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పు. దేవేంద్ర గుప్తా, లోకేశ్‌ శర్మ, స్వామి అసీమానంద, భరత్‌ మోహన్‌లాల్‌ రతీశ్వర్, రాజేంద్ర చౌదరిలను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు.  

తీర్పులో న్యాయం లేదు
మక్కా మసీదు బాంబు పేలుళ్లలో మా బావ జాఫర్‌ మృతి చెందాడు. పెళ్లయి ఏడాది కాకముందే మరణించాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న జాఫర్‌ను నిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు చనిపోయాడు. ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పులో న్యాయం లేదు. దోషులను శిక్షించాల్సింది పోయి నిరపరాధులుగా విడుదల చేయడం సరైంది కాదు.     
– మహ్మద్‌ ఉమర్, మృతుడు జాఫర్‌ బావమరిది  

సరైన న్యాయం చేయలేదు
బాంబు పేలుళ్ల ఘటనలో ప్రార్థనలకు వెళ్లిన మా అల్లుడు  షేక్‌ నహీం మృతి చెందాడు. దాంతో అతడి తల్లి అనారోగ్యం పాలైంది. తీర్పు అనుకూలంగా రాలేదు. ఎన్‌ఐఏ సరైన న్యాయం చేయలేదు.    – మహ్మద్‌ సలీం, మృతుడు షేక్‌ నహీం మేనమామ

ఓ బాంబును నిర్వీర్యం చేశాం
మక్కా మసీదు బాంబు పేలుళ్లు మధ్యాహ్నం 1.20 గంటలకు జరిగినట్లు సమాచారం అందడంతో ఘటనా స్థలికి చేరుకున్నాం. చార్మినార్‌ వద్ద పరిస్థితి తీవ్రంగా ఉండటంతో సివిల్‌ డ్రెస్సులో లోపలికి వెళ్లాం. అప్పటికే రాళ్ల దాడులు, గొడవలు జరుగుతున్నాయి. పేలుడు జరిగిన బండరాయి వద్దకు వెళ్లి అక్కడ ఉన్న బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నాం. అందులో బాంబు ఉంది. వెంటనే ఖిల్వత్‌ ప్లే గ్రౌండ్‌లోకి తీసుకెళ్లి బాంబును నిర్వీర్యం చేశాం.     – సీహెచ్‌. నాగసాయి, బాంబు స్క్వాడ్‌ ఇన్‌స్పెక్టర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement