‘బర్నింగ్’ ప్రాబ్లమ్! | burning froblom in hyderabad | Sakshi
Sakshi News home page

‘బర్నింగ్’ ప్రాబ్లమ్!

Published Sun, Apr 24 2016 2:22 AM | Last Updated on Sun, Sep 3 2017 10:35 PM

‘బర్నింగ్’ ప్రాబ్లమ్!

‘బర్నింగ్’ ప్రాబ్లమ్!

విద్యుత్ శాఖకు ఎండల గండం     
అధిక ఉష్ణోగ్రతలతో కాలుతున్న ట్రాన్స్‌ఫార్మర్లు
సబ్‌స్టేషన్‌లపైనా తీవ్ర ప్రభావం     
డీటీఆర్‌లు, ఫీడర్లను చల్లార్చేందుకు ఫ్యాన్లు, కూలర్ల వినియోగం

సిటీలో ఇప్పుడు మండుతున్న ఎండలే ‘బర్నింగ్’ టాపిక్. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం అల్లాడుతున్నారు. ఎండలు మనుషులు, జంతువులు, పక్షులపైనే కాదు సబ్‌స్టేషన్లలోని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఓవర్‌లోడ్‌తోపాటు పగటి ఉష్ణోగ్రతలకు వేడెక్కుతున్న డీటీఆర్ (డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు)లను చల్లార్చేందుకు అధికారులు చివరికి కూలర్లు, ఫ్యాన్లు అమర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఆయిల్ లీకేజీలు, ప్రాపర్ ఎర్తింగ్ లేక, డీటీఆర్‌ల చుట్టూ పేరుకపోయిన చెత్త, ఏపుగా పెరిగిన చెట్ల వల్ల అవి కాలిపోతున్నాయి. అకస్మాత్తుగా మంటలు చెలరేగి స్థానికులను భయపెడుతున్నాయి. కోఠి, దిల్‌సుఖ్‌నగర్ పరిధిలో  శనివారం రెండు ట్రాన్స్‌ఫార్మర్లు ఎండవేడిమికి మంటలు చెలరేగి కాలిపోయాయి.    

 సాక్షి, సిటీబ్యూరో: నగరంలో భానుడు భగ్గున మండుతున్నాడు. గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీలు నమోదు అవుతున్నాయి. మండుతున్న ఎండలకు తోడు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం ఒక్కసారిగా పెరగడంతో విద్యుత్ డిమాండ్ అనుహ్యంగా పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం పది మిలియన్ యూనిట్ల వినియోగం పెరిగింది. దీంతో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు(డీటీఆర్) తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. సబ్‌స్టేషన్ల వద్ద ప్రాపర్ ఎర్తింగ్ లేక పోవడం, నేరుగా కనెక్షన్లు ఇవ్వడం, ఆయిల్ లీకేజీలకు తోడు బస్తీల్లో ఏర్పాటు చేసిన డీటీఆర్‌ల చుట్టూ పేరుక పోయిన చెత్తను రోజుల తరబడి తొలగించక పోవడంతో ఎండలకు మంటలు ఎగిసి పడుతున్నాయి.

ఫలితంగా న గరంలో రోజుకు సగటున ఐదు నుంచి పది డీటీఆర్‌లు కాలిపోతున్నట్లు తెలిసింది. ఇటీవ ల అడ్డగుట్ట సమీపంలోని శ్రీనివాసనగర్, కోఠి ఉమెన్స్ కాలేజీ సమీపంలో రెండు ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోగా, తాజాగా శనివారం కోఠి, ఐఎస్‌సదన్‌లో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లకు మంటలు అంటుకుని కాలిపోవడానికి ఇదే కారణం. ఇదిలా ఉంటే ఒత్తిడి నుంచి ఫీడర్లను కాపాడుకునేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కోసం వాటికి తాత్కాలికంగా ఫ్యాన్లు, కూలర్లు అమర్చుతున్నారు.

 నాసిరకం వైండింగ్..ఆయిల్ లీకేజీలతో నష్టాలు
రిపేరుకు వచ్చిన వాటిలో చాలా వాటికి కనీసం ఆయిల్ కూడా మార్చడం లేదు. లోపలి వైండింగ్ కూడా చాలా లోపభూయిష్టంగా ఉంటుంది. దీంతో ఆయిల్ లీక్ అవుతోంది. నాసిరకం వైండింగ్ వల్ల ఆరుమాసాల వ్యవధిలో ఒకే ట్రాన్స్‌ఫార్మర్ రెండుసార్లు కాలి పోతోంది. వేసవిలో సహజంగానే విద్యుత్ వినియోగం ఎఉ్కవ. డీటీఆర్‌లపై అదనపు భారం తప్పదు. టెంపరేచర్ పెరిగినప్పుడు ట్రాన్స్‌ఫార్మర్‌లోని సెల్ఫ్ ప్రొటెక్షన్(సీఎస్‌పీ) పరికరం ఫీడర్‌ను ట్రిప్ చేస్తుంది. కానీ నగరంలో ఏ ఒక్క చోట కూడా ప్రాపర్ ఎర్తింగ్ లేకపోవడం, నేరుగా కనెక్షన్లు ఇస్తుండటం వల్ల డీటీఆర్‌లు కాలిపోతున్నట్లు స్వయంగా అధికారులే స్పష్టం చేస్తున్నారు. గ్రేటర్ లో ఐదేళ్లలో కేవలం నాలుగు డివిజన్ల పరిధిలో 22,720 డీటీఆర్‌లు కాలిపోగా, 2015-16లో ఒక్క రంగారెడ్డి సౌత్ సర్కిల్‌ల ో్లనే 2112 డీటీఆర్‌లు షెడ్డుకు చేరుకోవడం విశేషం. వీటి రిపేర్ల కోసం ఒక్క ఏడాదిలోనే రూ.8 కోట్లకు పైగా ఖర్చు చేయడం గమనార్హం.

 కేటాయింపులోనూ అవినీతి
విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులను నివారించేందుకు ఏటా కొత్తగా వేలాది ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేస్తారు.వీటి కేటాయింపులో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు స్వయంగా డిస్కం పెద్దలే అంగీకరిస్తున్నారు. ఇప్పటి వరకు కేటాయిం చిన వాటి పని తీరు, కంపెనీ ఇచ్చిన గ్యారంటీ గడువు వంటి అంశాలు పరిశీలించకుండానే కొత్తవి కేటాయిస్తున్నారు. ప్రజావసరాల కోసం ఉపయోగించాల్సిన ఈ ట్రాన్స్‌ఫార్మర్లను స్థానిక అధికారులు ప్రైవేటు వాణిజ్య సముదాయాలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. కొత్తవాటి కేటాయింపులోనే కాదు కాలిపోయినవి రిపేర్లకు కేటాయించడంలోనూ  అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. నగరంలో ఐదు రిపేరింగ్ షెడ్డులు ఉన్నా.. వీటిని కాదని మహేశ్వరం సమీపంలో ఉన్నషెడ్డుకే ఎక్కువగా కేటాయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement