'గతంలో ఇలాగే చిచ్చు పెట్టారు'
హైదరాబాద్: కాపులకు, బీసీలకు మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ఆరోపించారు. గతంలో మాల, మాదిగల మధ్య ఇలాగే చిచ్చు పెట్టారని గుర్తు చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. బీసీలకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ సహించదని హెచ్చరించారు. నేడు జరుగుతున్న కలెక్టరేట్ల ముట్టడి వెనుకున్నది చంద్రబాబేనని ఆరోపించారు.
కాపు ఐక్య గర్జనకు హాజరైతేనే కేసు పెడతారా, ఏ ప్రతిపాదికన కేసు పెట్టారని ప్రశ్నించారు. కాపు ఐక్య గర్జనలో ముద్రగడ ఒక్కరే మాట్లారని, మిగతా నేతలెవరూ ప్రసంగించలేదని తెలిపారు. ఇలాంటి కేసులకు భయపడబోమన్నారు. చంద్రబాబు ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే జైళ్లు సరిపోవని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా రైతులు, నిరుద్యోగులు, మహిళలు కూడా రోడెక్కుతారని రామచంద్రయ్య హెచ్చరించారు.