'లెక్క' లేదు
ఎన్నికల ఖర్చును చూపని అభ్యర్థులు
కొందరి సమాచారంలో తేడా అన్ని పార్టీలదీ అదే తీరు
సిటీబ్యూరో: ఓ అభ్యర్థి... ఆయన వెనుక బస్తీ నిండా కార్యకర్తలు... వాహనాల బారులు... ఇది అందరికీ కనిపించే వాస్తవం. రెండే వాహనాలు... 20 మందే కార్యకర్తలు...ఇదీ కాగితాల్లోని ‘లెక్క’. వీరికి వెచ్చించే మొత్తంలోనూ ఆ తేడా ‘చూపిస్తున్నారు’. ఇదీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తీరు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తాము చేసే ఖర్చుకు సంబంధించి ఏ రోజుకారోజు లెక్కలను రిటర్నింగ్ అధికారులకు అందజేయాలి. ప్రతి రోజూ కాకపోయినా.. మూడు రోజులకోమారు తమ ఖర్చులను చూపించాలి. ప్రచారంలో భాగంగా చేసే ఖర్చులన్నీ పొందుపరచాలి. అభ్యర్థితో పాటు ప్రచారంలో పాల్గొనే వారు వినియోగించే వాహనాలు.. వారికి అందజేసే టీలు, టిఫిన్ల నుంచి సమస్త సమాచారం పొందుపరచాలి. బహిరంగ సభల వేదికలు.. టెంట్లు, కుర్చీలకు సైతం లెక్కలు చూపాలి. గతంలో ఎన్నికలు ముగిశాక 45 రోజుల్లోగా ఖర్చులన్నీ చూపే అవకాశం ఉండేది.తాజాగా మూడు రోజులకోమారు ‘లెక్క’ చెప్పాల్సిందిగా నిబంధనలు మార్చారు. అయినప్పటికీ అభ్యర్థులెవరూ పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు మొత్తం 1,333 మంది. వీరిలో దాదాపు 650 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. మిగతా వారు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన వారు. అంతో ఇంతో ఇండిపెండెంట్ అభ్యర్థులే లెక్కలు చూపుతున్నారు. గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు మాత్రం రిటర్నింగ్ అధికారుల హెచ్చరికలు ఖాతరు చేయడం లేదు. ప్రచారానికి, లోపాయికారీ బేరాలకే తమకు సమయం సరిపోవడం లేదని... ఇప్పుడు లెక్కలు ఎలా చెప్పేదని కొందరు అభ్యర్థులు సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు.
ఖర్చు భారీ... లెక్క స్వల్పం
ఇప్పటికే అనేక వార్డుల్లో ఇబ్బడిముబ్బడిగా ఓటర్లకు తాయిలాల ఎర వేశారు. వివిధ వస్తువులతో కూడిన గిఫ్ట్‌ప్యాక్‌లు ముట్టజెబుతున్నారు. ఇంకొందరికి ఏం కావాలో తెలుసుకొని వాటిని సరఫరా చేస్తున్నారు. మహిళలు, యువకులు.. ఇలా ఎవరి ఆకాంక్షలకు అనుగుణంగా వారికి చీరలు, గాజులు, ప్లేట్ల నుంచి క్రికెట్ కిట్లు, జిమ్ పరికరాలు... గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చే స్తున్నా రు. ఇంకొందరు నేరుగా ఓటర్లకే ఫోన్ చేసి ‘అన్నా.. మీ ఇంట్లో ఐదు ఓట్లున్నాయి.. మూడు ఫుల్‌బాటిళ్లు పంపిస్తానన్నా... జర చూడు’ అంటున్నారు. ఈ బహుమతులు, నజరానాలు ఒక ఎత్తయితే... ప్రచారం చేసే కార్యకర్తలు.. వారి విందులకు చెల్లిస్తున్నవి మరో ఎత్తు. చాలామంది అభ్యర్థులు అడ్డా మీది కూలీలనే ప్రచారాలకు తీసుకు వెళ్తున్నారు. ఒక్కొక్కరు దాదాపు 200 మందిని వెంట తీసుకువెళ్తున్నారు. వారికి భోజనంతో పాటు ఒక పూట ప్రచారమైతే రూ.150 నుంచి రూ.200 వరకు... రెండు పూట లైతే రూ.300 నుంచి రూ. 500 వరకు చెల్లిస్తున్నారు. ఇవన్నీ లెక్కల్లో చూపడం లేదు. సాధారణ భోజన ఖర్చు మాత్ర మే చూపించే ఎత్తుగడలు వేస్తున్నారు. అంతేకాదు.. 200 మందితో ప్రచారం చేసినా... లెక్కల్లో 40 నుంచి 50 మందినే చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వారికి నోటీసులు పంపుతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. మరోవైపు అక్రమంగా తరలిస్తున్న దాదాపు రూ. 2.08 కోట్లను సర్వెలెన్స్ టీమ్‌లు స్వాధీనం చేసుకున్నాయి. దీనిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.
సమాచారం కరువు
అభ్యర్థుల ఖర్చుల వివరాలను ఏరోజుకారోజు వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని అధికారులు సెలవిచ్చినప్పటికీ... అమలు కావడం లేదు. సర్కిళ్ల స్థాయిలో లెక్కలను తాము వెల్లడించబోమని.. ప్రధాన కార్యాలయానికే పంపుతామని అక్కడ చెబుతుండగా... జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోనూ అధికారిక సమాచారం లేదు. ఈ సమాచారం తమ వద్ద లేదని చెప్పలేక... సర్కిళ్ల నుంచి పంపించలేదని చెప్పుకోలేక సంబంధిత అధికారులు సతమ తమవుతున్నారు.