విష వలయంగా రాజధాని: కేసీఆర్
♦ సరిదిద్దేందుకు నడుం బిగించండి
♦ ప్రజాప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి
♦ 11 నుంచి కార్పొరేటర్లకు శిక్షణ
♦ జీహెచ్‌ఎంసీ, పురపాలక శాఖపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ‘‘హైదరాబాద్ నగరం ఓ విష వలయంగా మారింది. దీన్నించి నగర ప్రజలను బయట పడేయాలి. నగరం ఎట్లుండేది, ఎట్లుండాలనే అంశాలను బేరీజు వేసుకుని కార్యాచరణ రూపొందించుకోవాలి’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ‘‘కాంట్రాక్టర్లు ముఠాలుగా ఏర్పడి చేసే దోపిడీకి అడ్డుకట్ట వేయాలి. నగరంలో కాపిటల్ అసెట్స్ పెరగడానికి, రోడ్లు బాగుపడడానికి జీహెచ్‌ఎంసీ నిధులు కేటాయించాలి. చెత్త, శిథిలాల తొలగింపు, నిధుల వినియోగం, పచ్చదనం, పారిశుద్ధ్యం, భూగర్భ డ్రైనేజీ తదితరాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ జరగాలి.
నగరంతో పాటు అందులో విలీనమైన మున్సిపాలిటీల అభివద్ధికి ప్రణాళికలు సిద్ధం కావాలి. మంజూరైన మల్టీ లెవల్ ఫ్లై ఓవర్లు, బస్ బేస్, మార్కెట్లు, పబ్లిక్ టాయిలెట్లు, శ్మశానవాటికల నిర్మాణ పనుల పురోగతిపై దృష్టి పెట్టండి. హైదరాబాద్‌ను మురికివాడల రహిత నగరంగా మార్చే ప్రణాళికను అమలు చేయండి. ప్రతి ఐదు వేల మందికి ఒక ప్రజా కమిటీ పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జీహెచ్‌ఎంసీలో భాగంగానే కంటోన్మెంట్‌నూ అభివద్ధి చేయండి’’ అని అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీతో పాటు పురపాలక శాఖపై కేసీఆర్ సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షనిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కడియ శ్రీహరి, పురపాలక మంత్రి కె.తారక రామారావు, మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, పద్మారావు గౌడ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఓ సునామీలా ఓట్లేసి టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించారని, వారందరి నమ్మకాన్ని నిలబెట్టేల పని చేయాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలు గుర్తెరిగి ప్రజల కోసం పనిచేయాలన్నారు. గత ప్రభుత్వాల విధానాల వల్ల జీహెచ్‌ఎంసీ ఆర్థిక పరిస్థితి దిగజారిందని ఈ సందర్భంగా సీఎం అన్నారు. వ్యయ ప్రయాసలకోర్చి కరెంటు ఇస్తున్నామని, ఈ విషయాన్ని పారిశ్రామికవేత్తలకు విడమరిచి వారి లో విశ్వాసం నింపాలని చెప్పారు. ‘‘జీహెచ్‌ఎంసీలో ప్రతి నియోజకవర్గంలో 4,700 డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పాం. ఇది ఫలించాలంటే ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కలిసి పనిచేయాలి. అలాగని ప్రతిజ్ఞ చేయాలి. టీం వర్క్ చేయాలి. బృందాలుగా ఏర్పడి హైదరాబాద్‌లో జరగాల్సిన, జరుగుతున్న పనులను పర్యవేక్షించాలి. అందరం కలిస్తే ఏదైనా చేయవచ్చు’’ అని పిలుపునిచ్చారు.
కార్పొరేటర్లకు శిక్షణ
భావి అవసరాలకు తగ్గట్లు హైదరాబాద్‌ను తీర్చిదిద్దాల్సిన తక్షణ కర్తవ్యం నగర కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులపై ఉం దని సీఎం అన్నారు. చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేయాలని కార్పొరేటర్లకు సూచించారు. ఈ నెల 11, 12 తేదీల్లో హైదరాబాద్ కార్పొరేటర్లకు, 13న వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం కార్పొరేటర్లకు ‘ఆడ్మినిస్ట్రేటీవ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా’(ఆస్కీ) ఆధ్వర్యంలో ప్రగతి రిసార్ట్స్‌లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. శిక్షణ తరగతుల్లో కార్పొరేటర్లను ఏ విధంగా కార్యోన్ముఖులు చేయాలనే అంశంపై ఎజెండా రూపొందించాలని అధికారులను కోరారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీటిలో పాల్గొనాలన్నారు. ‘‘నాగపూర్, ముంబై, ఢిల్లీ తదితర నగరాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేయండి. ఆయా కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లను శిక్షణ తరగతులకు పిలిచి వారి అనుభవాలు పంచుకోండి’’ అని సూచించారు.